దక్షిణాదిలో ప్రబలుతున్న వైరస్‌ బలహీనం  

* భారత్ లో మరణాల రేట్ 17 శాతం తక్కువ 

* దక్షిణాదిన కేసులు, మరణాలు చాల తక్కువ 

దక్షిణాదిలో ప్రబలుతున్న వైరస్‌ బలహీనంగా ఉండటం వల్లనే మరణాల రేటు తక్కువగా ఉన్నదని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) భావిస్తున్నది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రబులుతున్న వైరస్‌కు, మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ వంటి రాష్ర్టాలలో విస్తరిస్తున్న వైరస్‌కు స్పష్టమైన తేడా ఉన్నట్టు సీసీఎంబీ జరుపుతున్న ‘జీనోమ్‌ సీక్వెన్సీ’ పరీక్షలలో స్పష్టమవుతున్నది. 

పరిశోధకులు దక్షిణాదిలో మనుగడులో ఉన్న వైరస్‌కు ‘ఏ3ఏ’గా, ఉత్తర భారతంలో విజృంభిస్తున్న వైరస్‌కు ‘ఏ2ఏ’గా పేరుపెట్టారు.  ఉత్తరాదిలో కేసులు భారీగా నమోదవుతుండగా, దక్షిణాదిలో ఆ సంఖ్య తక్కువగా ఉన్నది. ఈ రెండు వైరస్‌లలో స్పష్టమైన తేడా ఉన్నట్టు తమ జన్యు క్రమ పరీక్షలలో తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. 

దక్షిణాదిలో ప్రబలుతున్న వైరస్‌ సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌లో వ్యాప్తి చెందుతున్న వైరస్‌ జన్యుక్రమం ఒక్కటిగా ఉన్నదని నిర్ధారించారు. ఈ వైరస్‌ బలహీనంగా ఉన్నదని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో మరణాల రేటు తక్కువగా ఉండటానికి ఇది ఒక కారణమని వెల్లడించారు. కరోనా జన్యుక్రమంలో మార్పుల గుట్టురట్టు చేయడానికి సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా నేతృత్వంలో గత నెల రోజులుగా జీనోమ్‌ సీక్వెన్సీ పరిశోధనలను జరుగుతున్న విషయం తెలిసిందే. 

ఇందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ కూడా కొంత సహకారమందించింది. ఇప్పటివరకు వందకు పైగా  వైరస్‌ నమూనాల జన్యువులను వేరు (ఐసోలేట్‌) చేసి లోతుగా పరిశీలించారు. ఈ పరిశోధనలలో కరోనా జన్యువులలో తేడాలను గ్రహించగలిగారు. దేశంలో విస్తరిస్తున్న వైరస్‌ ప్రధానంగా రెండు రకాలుగా ఉన్నట్లు గుర్తించారు.

గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, అక్కడి వైరస్‌ మ్యుటేషన్‌లో తేడా ఉందని చెప్పారు. ఇక్కడ ప్రబలుతున్న కరోనా జన్యువు అమెరికా, చైనా, ఇటలీ దేశాలలోని కరోనా జన్యువుతో సరిపోలుతున్నట్లు  గుర్తించారు.   

భారతదేశంలో కరోనా మరణాల రేటు 3.3శాతంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల రేటుతో పోలిస్తే దాదాపు 17శాతం తక్కువ. కానీ మన దేశంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో అది 5 శాతం ఉండగా, దక్షిణాదిలో 3 శాతం లోపే ఉన్నది. ఉత్తర భారతంలో విస్తరిస్తున్న వైరస్‌ యూరప్‌ దేశాల నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. 

దక్షిణాదిన ప్రబలుతున్న వైరస్‌ దక్షిణాసియా దేశాల నుంచి ప్రధానంగా సింగపూర్‌ లేదా ఫిలిప్పీన్స్‌ నుంచి వ్యాప్తి చెంది ఉంటుందని తెలిపారు. దక్షిణాదిలో ప్రబలుతున్న కరోనా వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. దక్షిణాదిలో కరోనా సోకిన వారికి  వైరస్‌ లోడ్‌ తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. దీని వల్ల వైరస్‌ ప్రభావం తీవ్రత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.