ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ సంకేతం

నిర్ణీత సమయానికి ఆర్నెళ్ల ముందు జరిగే ఎన్నికలు ముందుస్తు ఎన్నికలు కావని అంటూనే ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సన్నాహాలను చేపట్టారు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడికి తెర తీశారు.  రాబోయే ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్‌లోనే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని, పైగా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పడం ద్వారా ఎన్నికల నగారా మోగించారు.

 

పార్టీ తరఫున ప్రగతి నివేదన సభను ఔటర్ రింగురోడ్డు సమీపంలో 1500 ఎకరాలలో రాష్ట్ర చరిత్రలోనే చూడనంత భారీస్థాయిలో సెప్టెంబర్ 2న నిర్వహిస్తామని చెప్పారు. ఆ రోజుననే 80 శాతం మంది అభ్యర్ధులను కుడా ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు పదిమంది పూర్తిగా యాక్టివ్ కావాలని కెసిఆర్ స్పష్టం చేసారు. వీరు మొత్తం జిల్లాలు పర్యటించి, ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లతోపాటు అభ్యర్థుల ప్రకటనకు అవసరమయ్యే నివేదికలన్నీ సిద్ధంచేయాలని కోరారు. మూడు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున ఇంచార్జులు, ప్రధాన కార్యదర్శులు క్షేత్రస్థాయిలో తిరుగుతారని చెప్పారు. మిగిలిన ఆఫీస్ బేరర్లు కార్యాలయంలో ఉండి సభా ఏర్పాట్లను చూస్తారని తెలిపారు.

 

వందకు వంద శాతం 100కుపైగా స్థానాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కాగా ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేస్తూ సిట్టింగ్ అభ్యర్ధులు అందరికి దాదాపుగా తిరిగి సీట్లు ఇస్తామని ప్రకటించడం ద్వారా పార్టీలో గందరగోళం లేకుండా చేసారు. ఎన్నికల సన్నాహాలకు పార్టీ పరంగా ఏర్పాట్లను కుడా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసారు.

 

అభ్యర్థుల ఎంపికలో అద్యక్షుడు కెసిఆర్ కు  పూర్తి అధికారం ఇస్తూ రాష్ట్ర పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసారు.  సర్వేల వడపోత, స్క్రీనింగ్ కోసం సంపూర్ణంగా పనిచేయడానికి మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటుచేసుకోబోతున్నట్టు వెల్లడించారు.