నాలుగు రోజుల్లో వేయి మంది మృతి 

* ఊహించనంత వేగంగా విస్తరిస్తున్న వైరస్ 

* 15 రోజుల్లో కేసులు, 17 రోజుల్లో మరణాలు రెట్టింపు 

భారత్‌లో కరోనా వైరస్ ఊహించనంత వేగంగా విస్తరిస్తోంది. గత రొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,851 పాజిటివ్ కేసులు బైటపడ్డాయి. దీంతో శుక్రవారం  ఉదయానికి దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య2.26 లక్షలకు చేరుకొంది.  మరణా సంఖ్య కూడా రోజురోజుకు గణనీయంగా పెరుగుతూ ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో 273 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

కేవలం గత నాలుగు రోజుల్లోనే దాదాపు వెయ్యి మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 6,300కు చేరుకుంది. దీంతో కరోనా మరణాల విషయంలో ప్రపంచంలో ఇప్పటివరకు 13వ స్థానంలో ఉన్న భారత్ 12వ స్థానానికి ఎగబాకింది. ఇక దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,770కు చేరుకోగా , 1,10,960 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో కరోనా కేసులు గత 15 రోజుల్లో రెట్టింపు కాగా మరణాలు సైతం 17 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. మే 18న 3,029 మరణాలు ఉండగా, జూన్ 4వ తేదీకి 6,075కు చేరుకుంది. ప్రపంచంలో 7,400 మరణాలతో కెనడా 11వ స్థానంలో ఉండగా, భారత్ తర్వాతి స్థానంలో ఉంది. కాగా కోవిడ్ 19 కేసులు అధికంగా ఉన్న దేశాల్లో మాత్రం మన దేశం ఏడో స్థానంలో ఉంది. 

ఇప్పటి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 43,86,376 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఐసీఎంఆర్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది.  అయితే గత 24 గంట‌ల్లో 1,43,661 మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఐసీఎంఆర్ ఇవాళ వెల్ల‌డించింది.  ఇవాళ దేశంలో న‌మోదు అయిన‌ పాజిటివ్ కేసుల సంఖ్య ఇదే అత్య‌ధికంగా. భార‌త్‌లో వైర‌స్ రిక‌వ‌రీ రేటు 48.27 శాతంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో 480 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు కరోనా పోకింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 19 మంది వైద్యులు,38 మంది నర్సులున్నారు. కాగా కరోనా సోకిన వారిలో ముగ్గురు చనిపోయారు. 

ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఆయన ఇప్పటివరకు కోవిడ్19 కట్టడి విధుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి జూన్ 1 వరకు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను ప్రజలకు వివరిస్తున్నారు.

తమిళనాడులో బుధవారం ఒక్క రోజే 1384 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.12 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు వెలుగు చూసిన కేసుల సంఖ్య 27,256కు చేరుకుంది.