గుళ్లలో తీర్థ ప్రసాదాలు వద్దు

కరోనా ప్రభావం గుళ్లలో తీర్థ ప్రసాదాలపై పడింది. కొన్ని రోజుల పాటు వాటిని భక్తులకు ఇవ్వొద్దని కేంద్రం సూచించింది. రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోనున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. 

దీని ప్రకారం భక్తులు ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనాలయాల వద్ద కచ్చితంగా ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. మాస్కులు ధరించని వారిని వాటిల్లోకి అనుమతించకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ దేవతా విగ్రహాలు, మూర్తులు, పవిత్ర గ్రంథాలను భక్తులు తాకకూడదు. కట్టడి ప్రాంతాల్లో ఉన్న ప్రార్థనాస్థలాలను తెరిచేందుకు అనుమతి లేదు. 

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 8.30కల్లా వాటిని మూసివేయాలని, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను కచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన మరికొన్ని మార్గదర్శకాలు.

ప్రార్థనాలయాల వద్ద 

* 65 ఏళ్ల పైబడ్డవారు, ఇతరత్రా రుగ్మతలు ఉన్నవారు, గర్భిణులు ప్రార్థనాలయాలకు వెళ్లకపోవడం మంచిది.

* భక్తులు వీలైనంత వరకు తమ పాదరక్షలను వాహనాల్లోనే వదిలి వెళ్లాలి.

* శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కొని లోనికి వెళ్లాలి.

* ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లను అమర్చాలి. * జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు లేనివారినే లోనికి అనుమతించాలి. 

*మాస్కులు లేనివారిని లోనికి అనుమతించకూడదు.

*ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. అందుకు సంబంధించి ప్రార్థనాస్థలాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.

*ఆలయంలో దేవతామూర్తులను, ఇతర ప్రార్థనాస్థలాల్లో పవిత్ర గ్రంథాలను తాకకూడదు.

*తీర్థ ప్రసాదాల వితరణ కుదరదు. పవిత్ర జలాలను చల్లడం నిషేధం.

*ప్రార్థనాలయాల వద్ద ఉండే విక్రయ శాలల వద్ద, సామూహిక వంటశాలలు, అన్నదానాల వద్ద భౌతిక దూరం పాటించాలి. 

*పార్కింగ్‌ ప్రదేశాల వద్ద కూడా గుమికూడి ఉండకూడదు.

షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లకు

భౌతికదూరం, మాస్కుల ధారణ, శానిటైజర్లను అందుబాటులో పెట్టడం, రద్దీ నియంత్రణ తప్పనిసరి.వినియోగదారులు, సిబ్బంది తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు విధిగా చేతి రు

*మాలు, టిష్యూను అడ్డుపెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం.

*వ్యాలెట్‌ పార్కింగ్‌ ఉన్నట్లయితే.. వాహనాలను తీసుకెళ్లే సిబ్బంది తప్పనిసరిగా మాస్కు, గ్లౌజ్‌లు, ఫేస్‌ షీల్డ్‌ను ధరించాలి. కారు తాళం చెవులు, స్టీరింగ్‌, గేర్‌పై డిస్‌ఇన్ఫెక్షన్‌ స్ర్పే చేయాలి. 

*మాల్స్‌లో పరిమిత సంఖ్యలో వినియోగదారులను అనుమతించాలి. వారు వెళ్లాకే మిగతా వారిని లోనికి పంపాలి.

*ఏసీల వినియోగం ఉంటే.. కేంద్రం ఇంతకు ముందు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య, గాలిలో తేమ 40-70ు మధ్య ఉండేలా చూడాలి.

*రెస్టారెంట్లలో సీటింగ్‌ సామర్థ్యంలో 50ు మందినే అనుమతించాలి. *భౌతిక దూరం తప్పనిసరి. 

*డిజిటల్‌ పేమెంట్‌కు ప్రాధాన్యమివ్వాలి. 

* వినియోగదారులు వెళ్లగానే, మరొకరు వచ్చి కూర్చునేలోపు టేబుళ్లు, కుర్చీలను శానిటైజ్‌ చేయాలి. 

ఆఫీసుల్లో 

* కరోనా లక్షణాలు లేని ఉద్యోగులు లేదా విజిటర్లను మాత్రమే లోపలికి పంపాలి. 

* సాంఘిక దూరంతో ఉద్యోగుల సీటింగ్​ను అరెంజ్​ చేయాలి.

* ఎవరైనా అధికారి లేదా సిబ్బంది కంటెయిన్​మెంట్​ జోన్​లో నివసిస్తూ ఉంటే తప్పనిసరిగా సంబంధిత అధికారికి చెప్పాలి. 

*కంటెయిన్​మెంట్​ జోన్​ తీసేసేంత వరకు ఆఫీసుకు రావొద్దు. ఇంటి నుంచే పనిచేయొచ్చు. దానిని లీవ్​ పీరియడ్​గా లెక్కిస్తారు.

* డ్రైవర్లు సోషల్​ డిస్టెన్స్​ పాటించాలి. వాళ్లు నడిపే వాహనాలను సోడియం హైపోక్లోరైట్​తో శుభ్రం చేయాలి.

*హైరిస్క్​ ఉన్న పెద్ద వయసు ఉద్యోగులు, గర్భిణులు, ఇతర జబ్బులున్నోళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాజమాన్యాలు వీలైనంత వరకు వాళ్లతో ఇంటి నుంచే పనిచేయించాలి.

* సమావేశాలన్నీ వీడియో కాన్ఫరెన్స్​లోనే జరగాలి.

* ఆఫీసుకు దగ్గర్లోని షాపులు, కేఫెటేరియాల్లో సాంఘిక దూరం​ ఉండాలి.