తమిళనాడు, తెలంగాణలో 'క్లేడ్‌ ఎ3ఐ' కరోనా

హైదరాబాద్‌ 'సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులల్‌ బయాలజీ' (సిసిఎంబి)కి చెందిన శాస్త్రవేత్తలు దేశంలో భిన్నమైన కరోనా వైరస్‌ రకాన్ని గుర్తించారు. దీనికి 'క్లేడ్‌ ఎ3ఐ' అని పేరుపెట్టారు. 

దేశంలో మొత్తం 64 జన్యుక్రమాలను విశ్లేషించగా, 41 శాతం జన్యువుల్లో వీటి ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో ఈ రకం వైరస్‌ వ్యాప్తిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వివరాలను ట్విట్టర్‌లో వెల్లడించారు.

భారత స్త్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో సిసిఎంబి పనిచేస్తుంది. సిసిఎంబి డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణ, తమిళనాడు నుంచి సేకరించిన నమూనాల్లో చాలా వరకు 'క్లేడ్‌ ఎ3ఐ' రకం వైరస్‌ ఉన్నట్లు చెప్పారు.దేశంలో కరోనా ప్రబలిన తొలినాళ్లలోనే ఈ నమూనాలను సేకరించినట్లు తెలిపారు. 

ఢిల్లీలో సేకరించిన నమూనాల్లో క్లేడ్‌ ఎ3ఐకి కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, గుజరాత్‌, మహారాష్ట్ర నమూనాల్లో ఎలాంటి పోలికలు లేవని వివరించారు. సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌లలో గుర్తించిన కరోనా వైరస్‌కు క్లేడ్‌ ఎ3ఐకి దగ్గరి పోలికలు ఉన్నట్లు చెప్పారు.