భారత్‌కు సారీ చెప్పిన అమెరికా

అమెరికాలో ఆందోళ‌న‌కారులు.. మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. వాషింగ్ట‌న్ డీసీలోని భారత రాయబారి కార్యాలయం ఆవరణలో  ఉన్న గాంధీ విగ్ర‌హాన్ని న‌ల్ల‌జాతీయులు ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది.   బ్లాక్ లైవ్స్ మ్యాట‌ర్ నిర‌స‌న‌కారులు ఈ విధ్వంసానికి పాల్ప‌డిన‌ట్లు ఓ వార్త సంస్థ పేర్కొన్న‌ది. జూన్ 2-3 రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. 

ఈ విధ్వంసంపై రాయబారి కార్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాషింగ్ట‌న్ పార్క్ పోలీసులు విచార‌ణ మొద‌లుపెట్టారు. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ న‌ల్ల‌జాతీయుడిని పోలీసులు హ‌త‌మార్చ‌డంతో అమెరికా అంత‌టా ఆందోళ‌న‌లు మిన్నంటిన విష‌యం తెలిసిందే.

ఆ ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన్ని చోట్ల హింసాత్మ‌కంగా మారాయి.  అయితే వాషింగ్ట‌న్‌లోని భార‌తీయ దౌత్య‌కార్యాల‌యంలో గాంధీ విగ్ర‌హం ధ్వంసం కావ‌డం కూడా ఆందోళ‌న‌కారులు ప‌నే అని తేలింది.   

 8 అడుగులు 8 అంగుళాల ఎత్తులో ఉన్న ఈ విగ్రహాన్ని రాయబార కార్యాలయానికి సాంస్కృతిక సంబంధాలకు భారత మండలి అక్టోబర్, 1998లో బహుమతిగా ఇచ్చింది. కొలంబో జిల్లాలోని తమ భూభాగంలో ఈ విగ్రహం ఏర్పాటు చేసి, నిర్వహించడానికి  అమెరికా కాంగ్రెస్ భారత రాయబార కార్యాలయానికి అనుమతి ఇచ్చింది. 

వాషింగ్ట‌న్ డీసీలో గాంధీ విగ్ర‌హం ధ్వంస‌మైన ఘ‌ట‌న ప‌ట్ల అమెరికా క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.  త‌మ క్ష‌మాప‌ణ‌ల‌ను అంగీక‌రించాలంటూ అమెరికా రాయబారి  కెన్ జ‌స్ట‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

న‌ల్ల‌జాతీయు జార్జ్ ఫ్లాయిడ్ మృతి ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నాని, గాంధీ విగ్ర‌హ ధ్వంసాన్ని కూడా ఖండిస్తున్న‌ట్లు కెన్ జ‌స్ట‌ర్ పేర్కొన్నారు. ఎటువంటి వివ‌క్ష‌నైనా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.