గుజరాత్‌లో కాంగ్రెస్‌ కు మరో ఎదురుదెబ్బ  

త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాను స్పీకర్‌ రాజేంద్ర త్రివేది ఈ రోజు ఆమోదించారు. 

వడోదరలోని కార్జాన్‌ శాసనసభ్యుడు అక్షయ్‌ పటేల్‌, వాల్సాద్‌ జిల్లాలోని కప్రదా ఎమ్మెల్యే జీతూ భాయ్‌ చౌదరీ తమ పదవులకు జూన్‌ 3న రాజీనామా చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.  

దేశ వ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో గుజరాత్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయి. వీటికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో తన ఇద్దరు అభ్యర్థులు గెలిపించుకోవడం ఆ పార్టీకి కష్టంగా మారనుంది. 

కాగా, షెడ్యూల్‌ ప్రకారం మార్చి 36న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. ఇందులో అధికార బీజేపీకి 103, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకొక్క అభ్యర్థి గెలుపొందాలి అంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ బలం 66కు తగ్గిపోయింది. 

ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటకలో నాలుగు స్థానాలకు, రాజస్థాన్‌లో మూడు, మధ్యప్రదేశ్‌లో మూడు, జార్ఖండ్‌లో రెండు, మణిపూర్‌, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం రాష్ర్టాల్లో ఒక్కో స్థానం చొప్పున ఖాళీలు ఉన్నాయి. మొత్తం 24 స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి.