జల వివాదాలకు జగన్ కొత్త మెలిక 

ఒక వంక ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జలవినియోగంలో అక్రమాలపై పరస్పరం చేసుకున్న ఆరోపణలపై పరిశీలనకు కృష్ణ యాజమాన్య బోర్డు నేడు సమావేశం అవుతూ ఉండగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త మెలిక పెట్టింది. తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించాకే సంగమేశ్వరం లిఫ్ట్‌ డీపీఆర్‌ను ఇస్తామని స్పష్టం చేసింది. 

కృష్ణా నది యాజమాన్య  బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నది యాజమాన్య  బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశాలలో చర్చించాల్సిన ఎజెండాలను ఆయా బోర్డులకు అందజేసింది. వివాదాస్పద పోతిరెడ్డిపాడు విస్తరణ డీపీఆర్‌ ముచ్చటే ఎజెండాలో పేర్కొనలేదు. అపెక్స్‌కౌన్సిల్‌ ఆమోదం పొందే వరకు ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టొద్దనే కేంద్రం ఆదేశాలను అమలు చేయాలని గట్టిగా పట్టుబట్టాలని నిర్ణయం తీసుకుంది. 

గురు, శుక్రవారాల్లో జరిగే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల మీటింగుల్లో తెలంగాణను ఇరుకున పెట్టడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం, తుపాకులగూడెం, దేవాదుల ఫేజ్‌–3, సీతారామ లిఫ్ట్‌స్కీములన్నీ అక్రమమేనని ఏపీ మరోసారి ఆరోపించింది. 

గోదావరి నదిలో 954 టీఎంసీల వాటా తమకు ఉన్నట్టు తెలంగాణ చెప్పుకుంటోందని, దానిని అధికారికంగా నిర్ధారించాల్సి ఉందని బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించనుంది. పోలవరం ప్రాజెక్టుకు నష్టం చేకూర్చే కాళేశ్వరం సహా మిగతా ప్రాజెక్టులను ఆపేయాలని, ఈ విషయంలో కేంద్రం ఆదేశాలు పాటించేలా బోర్డు వ్యవహరించాలని పట్టుబట్టనుంది.ఫ్ట్‌స్కీంను ప్రతిపాదించామని, బచావత్ ‌అవార్డులో రాష్ట్రానికి చేసిన కేటాయింపులకు లోబడే అక్కడి నుంచి నీటిని తీసుకుంటామని కేఆర్‌ఎంబీకి ఇచ్చిన ఎజెండాలో ఏపీ పేర్కొంది. పోతిరెడ్డిపాడు విత్‌డ్రాయల్స్‌విషయంలోనూ గతంలో చేసిన వాదనను ప్రస్తావించింది. 

తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పిస్తే సంగమేశ్వరంపై చర్చలకు తాము సిద్ధమని, డీపీఆర్‌లు ఇవ్వకుంటే దానిపై మాట్లాడేదే లేదని తెగేసి చెప్పింది. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులన్నీ నిండి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వరద పోతున్న రోజుల్లో తీసుకునే నీటిని రాష్ట్ర కోటాలో లెక్కించకుండా మినహాయించాలని కోరింది. ఫ్లడ్‌వాటర్‌ యూసేజీపై సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసిన టెక్నికల్ ‌కమిటీ రిపోర్టును వెంటనే తెప్పించాలని, వరద జలాల్లో తమ రాష్ట్ర వాటాను తేల్చాలని బోర్డును కోరింది.

నాగార్జునసాగర్‌ఎడమ కాలువకు విడుదల చేస్తున్న నీటిలో తెలంగాణ ప్రభుత్వం ఏటా 39.41 నుంచి 43.67 శాతం నష్టంగా చూపిస్తోందని, దీంతో తమ రాష్ట్రానికి రావాల్సిన నీటిలో కోత పడుతుందని ఏపీ పేర్కొంది. ఎడమ కాలువలో ఏ మేరకు నీటి నష్టం ఉందో నిర్ధారించడానికి టెక్నికల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ ‌చేసింది. 

విభజన చట్టం ప్రకారం కృష్ణా  బోర్డును ఏపీలో ఏర్పాటు చేయాల్సి ఉందని, వెంటనే హైదరాబాద్‌నుంచి తమ రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరనుంది.