తెలంగాణలో 32 మంది డాక్టర్లకు వైరస్

కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం తగు రక్షణ పరికరాలు సమకూర్చలేక పోతున్నది. దానితో వైద్యులే వైరస్ బారిన పడుతున్నారు.  ఒక్కరో ఇద్దరో కాదు రాష్ట్రంలో 32 మంది డాక్టర్లకు వైరస్ సోకింది. వారికి మాస్క్​లు, పీపీఈ కిట్లు సరిగ్గా అందకపోవడమే ఇందుకు కారణం. 

కరోనా వార్డుల్లో ట్రీట్​మెంట్ అందించే డాక్టర్లకే పీపీఈ కిట్లు ఇచ్చిన ప్రభుత్వం మిగతా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు ఇవ్వడంలేదు. కొందరికి ఇచ్చినా వాటిలో నాణ్యత ఉండటం లేదు. ఐప్పటికే కరోనా టెస్టుల విషయంలో విఫలమైన ప్రభుత్వం.. డాక్టర్లకు రక్షణ కల్పించడంలోనూ విఫలమైంది. 

రోజూ వందలాది పేషెంట్లను చూస్తున్న డాక్టర్లకు వేరే చోట వసతి కూడా కల్పించడం లేదు.దీంతో తమ కుటుంభం సభ్యులకు కూడా వైరస్ సోకుతుందేమోనని వారు భయపడుతున్నారు.ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌‌, పేట్లబుర్జు, నిలోఫర్‌‌‌‌ దవాఖాన్లలో పనిచేస్తున్న 32 మంది డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్‌‌ టెక్నీషియన్లకు వైరస్ సోకింది. 

వీరిలో ఉస్మానియాలోని 20 మంది జూనియర్ డాక్టర్లు, పేట్లబుర్జు ప్రసూతి హాస్పిటల్‌‌లో పని చేస్తున్న నలుగురు గైనకాలజీ పీజీలకు, ఓ ప్రొఫెసర్‌‌‌‌కు, నిలోఫర్‌‌‌‌లో ఓ జూనియర్ డాక్టర్​కు, నిమ్స్‌‌లో నలుగురు కార్డియాలజిస్ట్‌‌లకు, ముగ్గురు క్యాథల్యాబ్ టెక్నీషియన్లకు పాజిటివ్ వచ్చింది. గాంధీలోని జనరల్ మెడిసిన్ డాక్టర్లలో ఇద్దరికి 4 రోజుల కిందట వైరస్ సోకింది. ఈ 35 కేసులూ గత వారంలోనే నమోదయ్యాయి. 

వీళ్లతో కాంటాక్టయిన మరో రెండొందల మంది డాక్టర్లకు టెస్టులు చేయించారు. ఇందులో కొందరి టెస్ట్ రిజల్ట్స్‌‌ రావాల్సి ఉంది. మరోవంక రాష్ట్రంలో చాలా కేసుల్లో వైరస్ లింక్ దొరకడం లేదు. డాక్టర్ల విషయంలోనూ ఇదే జరిగింది. వైరస్ బారినపడ్డ 29 మందిలో చాలా మందికి ఎవరి నుంచి అంటుకుందో తెలియలేదు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌‌ దవాఖాన్లకు నిత్యం 2 వేల నుంచి 3 వేల మంది రోగులు వస్తుంటారు. 

ఇప్పుడు గాంధీ హాస్పిటల్‌‌ను కరోనా పేషెంట్లకే కేటాయించడంతో, ఉస్మానియా, నిమ్స్‌‌కు రోగుల  తాకిడి పెరిగింది. ఫిజికల్ డిస్టెన్స్‌‌ పాటించాలని, ఫీవర్ ఓపీ కౌంటర్లు వేరుగా నిర్వహించాలని గైడ్‌‌లైన్స్‌‌ ఉన్నా చాలా దవాఖాన్లలో రూల్స్ అమలవట్లేదు. 

వేల సంఖ్యలో రోగులు  వచ్చే ఉస్మానియా, నిమ్స్‌‌లో మాస్క్, ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌ గురించి అడిగేటోళ్లు లేరు. ఒక్కో డాక్టర్‌‌‌‌ ఓపీలో పదుల సంఖ్యలో రోగులను పరీక్షిస్తున్నారు. ఆ సమయంలోనే వైరస్ అంటుకుని ఉంటుందని భావిస్తున్నారు. తమలోనే కొంతమంది వైరస్ బారిన పడడంతో ఓపీ చూడడానికి డాక్టర్లు భయపడుతున్నారు. ఉస్మానియా, పేట్లబుర్జులో పనిచేసే పీజీ డాక్టర్లందరూ హాస్టళ్లకే పరిమితమయ్యారు. చాలా ఆపరేషన్లను వాయిదా వేశారు.