‘అవినీతి సీఎం’ పై సర్వే చేస్తే మొదటే కేసీఆర్

జాతీయ మీడియా చేప‌ట్టిన‌ సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి 16 స్థానం దక్కిందని, అత్యంత చెత్త ముఖ్యమంత్రి అని నిర్దారణ అయిందని చెబుతూ అవినీతి ముఖ్యమంత్రిపై  సర్వే చేస్తే  కేసీఆరే మొదటి స్థానంలో ఉంటారని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ మంత్రివర్గంలో అంతా తెలంగాణ ద్రోహులేన‌ని ఉన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పింక్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు చెబుతూ  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఎక్కడ? అని ప్ర‌శ్నించారు. 

“తెలంగాణ వచ్చి ఆరు సంవత్సరాలు అయింది.. లక్ష ఉద్యోగాలు వచ్చాయి కానీ ఆఫీస్ లేదు. నిరుద్యోగ భృతి వచ్చింది కానీ వారికి అకౌంట్ లు లేవు. దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చింది కానీ ఏమీ పంట వేయాలో తెలియట్లేదు. దళిత ముఖ్యమంత్రి అయ్యాడు కాని ఎవరో తెలవదు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల లూటీ అయింది …అది కనిపించదు” అంటూ అవహేళన చేశారు. 

ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేవలం 25,000 ఉద్యోగాలు విడుదల చేసారని అర‌వింద్ విమర్శించారు. ఇప్పటి వరకు మూడు లక్షల మందికి నిరుద్యోగ భృతి లేదని, కేవలం కేసీఆర్ కుటుంబంలోని వారికి మాత్రమే ఉద్యోగాలు దొరికాయని దుయ్యబట్టారు. 

ప్రజలు తిరస్కరించిన వారు కూడా ఉద్యొగాలు పొందుతున్నారని అంటూ పరోక్షంగా కేసీఆర్ కుమార్తె కవితపై విసుర్లు విసినారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా సహాయం చేస్తున్నా.. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయటం లేదని మండిపడ్డారు. లాక్ డౌన్ లో రూ 1500 కేంద్రమే ఇచ్చింద‌ని, బియ్యం, పప్పు అన్నీ కూడా కేంద్ర నుంచే అమ‌లవుతున్నాయ‌ని స్పష్టం చేశారు. 

ఆయుష్మాన్ భవా పథకాన్ని ఎందుకు అమలు చేయటం లేదని ప్ర‌శ్నించారు. ఆ పథకం ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ లో కూడా అవినీతి జ‌రుగుతుంద‌ని అంటూ శవాల మీద పేలాలు వేరుకుంటున్నారని దుయ్యబట్టారు. మంత్రులు కూడా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.