చైనాకు అమెరికా విమానాలు రద్దు 

కరోనా వైరస్ వ్యాప్తికి చైనా కారణం అని మండిపడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై ఆంక్షలను తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా చైనా – అమెరికా మ‌ధ్య నడిచే చైనీస్ ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌ విమాన సర్వీసుల‌ను నిషేధించాల‌ని వైట్ హౌస్ యంత్రాంగం నిర్ణయించింది. ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాల‌ను చైనా ఉల్లంఘించ‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అమెరికా ట్రాన్స్ పోడిపార్ట్ మెంట్ చెబుతోంది.

క‌రోనా వైర‌స్ చైనాలోని  ల్యాబ్ లోనే త‌యారయిందని, వైర‌స్ వ్యాప్తి గురించి ప్ర‌పంచాన్ని ఆ దేశం అప్ర‌మ‌త్తం చేయ‌లేద‌ని  ట్రంప్ మండిపడుతూనే ఉన్నారు.  క‌రోనా పుట్టిన చైనాలో వైర‌స్ వ్యాప్తి అదుపులో ఉండ‌డం, మ‌ర‌ణాలు కూడా త‌క్కువ‌గా ఉండ‌డంతో  జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా స‌హా ప‌లు దేశాలు డ్రాగ‌న్ కంట్రీపై అనుమానాలు వ్య‌క్తం చేశాయి. 

దీంతో అస‌లు వైర‌స్ కు మూలం ఏంటో తెలుసుకునేందుకు ద‌ర్యాప్తుకు ఒప్పుకోవాలంటూ అమెరికా గ‌తంలో డిమాండ్ చేసింది. కానీ అందుకు చైనా ఒప్పుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో  జూన్ 16 నుంచి చైనాకు చెందిన నాలుగు ఎయిర్ లైన్స్ సంస్థ‌ల స‌ర్వీసుల‌ను రద్దు చేస్తున్న‌ట్లు అమెరికా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. 

చైనా త‌న దేశంలోకి యునైటెడ్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్ విమాన సర్వీసుల‌ను పున‌రుద్ద‌రించ‌క‌ పోవ‌డంతోనే అమెరికా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇరు దేశాల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాల‌ను చైనా ఉల్లంఘిస్తోంద‌ని అమెరికా ఆరోపిస్తోంది.

త‌మ దేశానికి చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌ను చైనా అనుమ‌తించేలా చైనా ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని ప్ర‌క‌టించింది.అయితే జూన్ 16 లోపు చైనా నుంచి సానుకూల స్పంద‌న రాకుంటే త‌మ నిర్ణ‌యం అమ‌లు చేస్తామ‌ని తెలిపింది.