భక్తుల రాకకోసం యాదగిరిగుట్ట సన్నద్ధం

భక్తుల రాకకోసం యాదగిరిగుట్ట సకల సౌకర్యాలతో సన్నద్ధమవుతున్నది. కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన  శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనంతోపాటు ఆర్జిత పూజల నిర్వహణ  ఈ నెల 8నుంచి పునఃప్రారంభంకానున్నాయి. అయితే  కొండ కిందనుంచి భక్తులు కాలినడకన కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. కొండపైకి ఎలాంటి వాహనాలకు అనుమతివ్వరు. 

స్వామి దర్శనానికొచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్‌ గీత తెలిపారు. కొండ కిందినుంచి పై వరకు కాలినడకన వెళ్లే భక్తులు భౌతికదూరం పాటించేలా నిర్ణీత బాక్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ముందుగా వారంపాటు ప్రయోగాత్మకంగా దర్శనాల ప్రక్రియను పర్యవేక్షిస్తామని చెప్పారు. 

యాదాద్రి కొండపై కరోనాకు ముందు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్‌లో 250 జంటలు కూర్చునేలా అనుమతించేవారమని, కానీ ఈ నెల 8 నుంచి ఒక్కో బ్యాచ్‌లో 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో గీత చెప్పారు. 

శ్రీవారి కల్యాణం జరిపించుకునేందుకు గతంలో 200 మంది దంపతులను అనుమతించే వారమని, ప్రస్తుతం 25 మంది దంపతులే కూర్చునేలా టికెట్లు ఇవ్వనున్నామని వెల్లడించారు. 

దర్శనాలు గత టైంటేబుల్‌ ప్రకారమే జరుగుతాయని ఆమె వివరించారు.  కాగా,దర్శనాలకు పదేండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లుపైబడిన వృద్ధులకు అనుమతిలేదని ఈవో గీత స్పష్టంచేశారు.