ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఆదేశ్‌ కుమార్‌ గుప్తా

ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఆదేశ్‌ కుమార్‌ గుప్తాను ఆ పార్టీ నియమించింది. ఆ పదవిలో కొనసాగుతున్న మనోజ్‌ తివారీని పార్టీ అధిష్టానం తొలగించింది. ఆదేశ్‌ కుమార్‌ ప్రస్తుతం నార్త్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా కొనసాగుతున్నారు. ఢిల్లీతో పాటు ఛత్తీస్‌గఢ్‌ అధ్యక్షుడిగా విష్ణు దియో సాయి, మణిపూర్‌కు ఎస్‌ తికేంద్ర సింగ్‌ లను నియమించారు.

ఈ సందర్భంగా ఆదేశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో తనకు కట్టబెట్టిన పదవిని నిర్వర్తిస్తానని తెలిపారు. ఢిల్లీలో క్షేత్ర‌ స్థాయి నుంచి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక నిర్మాణాత్మకమైన సంస్థను స్థాపించి.. ప్రజల్లోకి వెళ్లాలి అని చెప్పారు. ఓటర్లను సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తామని ఆదేశ్‌ కుమార్‌ చెప్పారు. 

 రెండు సార్లు ఎంపీగా ఉన్న మనోజ్‌ తివారి 2016లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి వైదొలగాలని భావించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే నూతన అధ్యక్షుడి ఎంపిక చేపట్టే వరకు పదవిలో కొనసాగాల్సిందిగా తివారీకి బీజేపీ అధిష్టానం నుంచి కోరింది.