తక్షణమే జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలి  

ఏడాదిలో ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పిన అస్తవ్యస్త పాలనను సాగించైనా  వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జగన్‌ మేక తోలు కప్పుకున్న పులి అంటూ దుయ్యబట్టారు. 

"ఒక్క అవకాశం అంటూ అభ్యర్థించి అధికారంలోకి వచ్చారు. ఈ ఏడాది కాలంలో మేక తోలు తీసేశారు. పులి స్వరూపాన్ని చూపిస్తున్నారు. అనుభవ, అవగాహన రాహిత్యం, అహంకారం, ఆత్రం, ఆంక్షలు, అవినీతి, పోలీసు రాజ్యం, రివర్స్‌ టెండరింగ్‌, కక్షసాధింపు అంశాలతోనే ఏడాది పాలన సాగించారు’’ అని విమర్శించారు.

అధికారంలోకి రాకముందు "అవినీతి మహారాజు" అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పుస్తకాలు వేసి, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతరులకు పంచి పెట్టి అధికారంలోకి వచ్చి అవినీతి డబ్బులు కక్కిస్తానన్న జగన్ ఈ సంవత్సర కాలంలో ఒక్క మూడు రూపాయల అవినీతిపైనా అయినా కేసు నమోదుచేశారా?  అని కన్నా ప్రశ్నించారు. 

ఏడాది పాలనలో ఒక్క పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. ఇప్పటికే జగన్‌ పాలనను చూసిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారన్న నమ్మకం పోయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు  మాదిరిగానే రాష్ట్రానికి గుండెలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని కన్నా ధ్వజమెత్తారు. 

టీడీపీ ప్రభుత్వం పోలవరంలో అవినీతికి పాల్పడిందనీ, ఆ పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన జగన్‌ వాటిని ఎందుకని నిరూపించలేదని ప్రశ్నించారు. జగన్‌ అసమర్థతకు ఇదో ఉదాహరణనని మండిపడ్డారు. జగన్‌ చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.