కృష్ణ జలాలపై పోరుకు తెలంగాణ బిజెపి సై 

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ప్రాంతానికి నికర, వరద జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చేసుకున్న రహస్య ఒప్పందం, వైఫల్యాలపై ఉద్యమించటం కోసం కృష్ణా నదీ జలాల పోరాట కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. 

బిజెపి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నదీ జలాల వాడకం విషయంలో టీఆర్ఎస్ సర్కారు అనుసరిస్తున్న చట్టవ్యతిరేక విధానాలపై  ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైతే ప్రత్యక్ష పోరాటాలు చేపట్టాలని నిర్ణయించారు. 

తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కృష్ణానదీ జలాల వినియోగం విషయంలో గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కాబడ్డప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఈ అన్యాయం అదేవిధంగా కొనసాగిందని చెప్పుకొచ్చారు. 

బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కలేదని ధ్వజమెత్తారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మన వాటా మనకు దక్కే విధంగా మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ సర్కార్ గత ఆరేళ్లుగా ఈ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు సరిగా వినిపించలేని విమర్శించారు. 

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా 811 టీఎంసీలలో మన వాటాను పెంచుకునేందుకు ఉన్న చక్కటి అవకాశాన్ని కూడా కేసీఆర్ వినియోగించుకోలేక పోయారని సంజయ్ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జిఓ కారణంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి తలెత్తిందని హెచ్చరించారు. 

దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రజలకు చెందిన నీటిని కాపాడుకునేందుకు బిజెపియే ముందుగా పోరాటం చేసిందని చెబుతూ కేసీఆర్ ఈ విషయంలో నామమాత్రంగానే కృష్ణా బోర్డుకు లేఖ వ్రాసారని ధ్వజమెత్తారు. బిజెపి పోరాటానికి స్పందించిన కేంద్రం ఈరోజు కృష్ణా-గోదావరి బోర్డు సమావేశం నిర్వహించాలని ఆదేశించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నీటి హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి జి కిష్ణ రెడ్డి తెలిపారు. దీనిపై బిజెపి పోరు కొనసాగుతుందని ప్రకటించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో సమగ్రంగా చర్చించి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘తెలంగాణ ప్రాజెక్టుల సాధన పోరాట సమితి’ని ఏర్పాటు చేసి ముందుకు సాగుతామని తెలిపారు. 

తన స్వార్ధం కోసం కేసీఆర్.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి డి కె అరుణ   విమర్శించారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్యవైఖరితో వెళ్లారని దయ్యబట్టారు.