నేటి నుండి దేశ వ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లు 

సోమవారంనాటి నుంచే దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టడం ప్రారంభించాయి.  మొదటి రోజు ఈ రైళ్లలో 1.45 లక్షల మందికిపైగా గమ్యస్థానాలకు చేరనున్నారు.

జూన్ 1 నుంచి 30 వరకు ఈ రైళ్లలో ప్రయాణించేందుకు 26లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నారని రైల్వే శాఖ వెల్లడించింది. ఇక ప్రయాణికులకు టికెట్ రిజర్వేషన్ తప్పనిసరి. ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లతో రైళ్లు నడవనున్నాయి. 

జనరల్ కోచ్‌ల్లో ప్రయాణించాలన్నా రిజర్వేషన్ టికెట్ ఉండాల్సిందే. టికెట్ ధర గతంలో మాదిరిగానే ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది. మే 21, ఉదయం10 గంటల నుంచి ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో పాటు 8 రోజువారీ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌(హైదరాబాద్‌-న్యూఢిల్లీ)తో రైళ్ల పునః ప్రయాణం ప్రారంభమైంది. సోమవారం ఉదయం 6.25 గంటలకు నాంపల్లి స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరింది.  హుస్సేన్‌ సాగర్‌, ఫలక్‌నుమా, గోదావరి, రాయలసీమ, ధానాపూర్‌, గోల్కొండ, సచ్‌కండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మొదటి దశలో పునరుద్ధరించారు.  

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణం చేయాలంటే రైలు బయలుదేరే సమయానికి కనీసం 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. మాస్కు ధరించకపోతే అనుమతి ఇవ్వరు. 

ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారినే ప్రయాణించడానికి అనుమతిస్తారు. స్క్రీనింగ్ సమయంలో కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే ప్రయాణానికి అనుమతించేది లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.