అమెరికాలో జాత్యహంకారంపై అల్లర్లు... 1400 మంది అరెస్ట్

అమెరికాలో జాత్యహంకారంపై నల్లజాతీయుల నిరసనలు కొనసాగుతున్నాయి. గత సోమవారం మిన్నెపొలిస్‌లో పోలీస్‌ అధికారి చేతిలో హత్యకుగురైన జార్జ్‌ ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల శాంతియుతంగా జరుగుతుండగా, మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. 

దీంతో 17 నగరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న 1398 మంది అరెస్టు చేశారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలంటూ ప్రజలు భారీసంఖ్యలో నిరసనకార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో, ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన పోలీస్‌ అధికారిపై హత్య కేసు నమోదుచేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  

పోలీసుల హింసాకాండకు వ్యతిరేకంగా అమెరికాలోని అనేక నగరాల్లో ఆందోళనాకారులు రోడ్లపైకి వచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు హింసకు దిగుతున్నారు. దీంతో అనేక నగరాల్లో పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు దేశంలోని అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించాయి. శ్వేతజాతీయ పోలీసు క్రూరత్వంలో నల్ల జాతీయుడు మృతి చెందిన మిన్నియోపొలిస్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 

వరుసగా ఐదో రాత్రి కూడా ఇక్కడ హింసాకాండ చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌, గ్రెనేడ్‌లు ఉపయోగించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆందోళనాకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావడంతో లాస్‌ఏంజెల్స్‌, చికాగో, అట్లాంటాతోపాటు అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించారు. సియాటల్‌ నుంచి న్యూయార్క్‌ వరకు లక్షల సంఖ్యలో ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చారు. 

నల్లజాతీయుడు జార్జి ఫ్లోయడ్‌ను చంపేసిన పోలీస్‌ అధికారిపై తీవ్రమైన హత్యారోపణలను మోపాలని, చాలా మందిని అరెస్ట్‌ చేయాలని ఆందోళనకారులంతా నినదించారు. లాస్‌ ఏంజెల్స్‌లో పోలీసులు రబ్బరు బుల్లెట్లను వాడారు. చికాగో, న్యూయార్క్‌తోపాటు అనేక నగరాల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.