చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం

ప్రస్తుతం దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఆదివారం మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ  చాలా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించామని, ఇప్పుడే మరింత జాగ్రత్తగా ఉంటూ కరోనాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 

దశల వారీగా ఆంక్షలను ఎత్తివేస్తూ దేశవ్యాప్తంగా ఐదో దశ లాక్‌డౌన్‌ను జూన్‌ 30వ తేదీ వరకు పొడగించారు. షాపులు, దుకాణాలు, రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు, ఆలయాలు, రెస్టారెంట్లు ఇలా క్రమంగా ఒకదాని తర్వాత మరోకటి తెరుస్తూ  పోతున్నారు. ఇటువంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే కరోనా మరింతగా విజృంభించే అవకాశముంటుందని ప్రధాని హెచ్చరించారు. 

‘‘ఇప్పటి నుంచి కోవిడ్ నిబంధనలను మరింత కచ్చితంగా పాటించాలి. కరోనాపై పోరులో మరింత జాగరూకతతో ప్రవర్తిద్దాం. సామాజిక దూరంతో పాటు మరిన్ని నియమాలనూ యథావిథిగానే అనుసరించాలి. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ... ఇతర దేశాలతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

మాస్క్‌లు, శానిటైజర్లు వాడకం, భౌతికదూరం గతం కంటే ఇంకా తీవ్రంగా పాటించాల్సిన అవసరం ప్రస్తుతం ఉందని మోడీ స్పష్టం చేశారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా దేశంలోని ప్రజలు ఒకరినొకరు ఆదుకుంటూ ఆదర్శంగా నిలిచారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. 

వలస కార్మికుల విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించి, ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం చేశారని చెబుతూ వారి పట్ల మరింత ఉదారతతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌తో ప్రభావితం కాని సమాజమంటూ లేదని, అయితే పేదలు, వలస కూలీలు ఎక్కువగా నష్టపోయారని పేర్కొన్నారు.  ‘‘వలస కార్మికుల కష్టాలు మాటల్లో చెప్పలేనివి’’ అని పేర్కొన్నారు. 

లాక్‌డౌన్ సమయంలో రైల్వే శాఖ చాలా అద్భుతంగా సేవలందించిందని ఆయన ప్రశంసించారు. పగలు, రాత్రీ కష్టపడ్డారని, అటు కేంద్రం, ఇటు రాష్ట్రం,స్థానిక సంస్థలూ అందరూ కలిసి అహోరాత్రాలు శ్రమించి సేవలు చేశారని తెలిపారు.  కరోనా మహమ్మారితో పోరాడటంలో రైల్వే శాఖ ముందు వరుసలో నిలుస్తుందని కొనియాడారు.

కరోనాపై యుద్ధానికి కొత్తదారులను అన్వేషిస్తున్నాం. కరోనాపై దేశప్రజలంతా పోరాటం చేస్తున్నారు. కొవిడ్‌ వీరులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు అని మోదీ తెలిపారు. కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది.. యోగా ద్వారా దీన్ని అధిగమించవచ్చు అని మోదీ స్పష్టం చేశారు. దీని కోసం ఆయుష్‌ శాఖ మై లైఫ్‌ - మై యోగా బ్లాగ్‌ను ప్రారంభించిందని తెలిపారు. 

‘ఆయుష్మాన్ భారత్’ తో ఇప్పటి వరకూ కోటి మంది ప్రజలు లబ్ధి పొందారని, పక్క రాష్ట్రాల్లో కూడా ఉచితంగా వైద్య సదుపాయం పొందవచ్చన్నారు. ఆంఫన్ తుఫాను కారణంగా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయని, అయినా సరే... ఆ రాష్ట్రాల ప్రజలు చూపించిన తెగువ, ధైర్యం అత్యంత సాహసోపేతమైందని మోదీ  కొనియాడారు.