చైనాకు వ్యతిరేకంగా భారత్ తో సహా డీ-10 కూటమి 

కరోనా అనంత పరిణామాలలో చైనాను కట్టడి చేసేందుకు అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలు ఒకటవుతున్నాయి. ఈ సందర్భంగా పారిశ్రామికంగా అత్యంత అభివృధి చెందిన జీ-7 దేశాలకు తోడు భారత్ తో సహా మరో మూడు దేశాలను కలిపి చైనాకు వ్యతిరేకంగా డీ-10 కూటమి ఏర్పడుతున్నది.  మొత్తంగా డీ-10 లొ అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఉండనున్నాయి. 

కీలకమైన సాంకేతిక పరిఙ్ఞానం కోసం చైనాపై ఆధారపడకుండా ఉండేందుకు, ముఖ్యంగా రానున్న కాలంలో కీలక పాత్ర పోషించబోతున్న 5జీ టెక్నాలజీకి సంభందించిన పరికరాలు, ఇతర సాంకేతిక అవసరాల కోసం చైనా మీద ఆధారపడకుండా సొంతగా తయారు చేసుకునేందుకు ఈ కూటమిని ఏర్పాటు చేశారు.

చైనా టెలికాం సంస్థపై అమెరికా ఆంక్షలు విధించిన నేపధ్యంలో ఆ దేశంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌లో హువేయి ప్రమేయంపై బ్రిటన్‌ నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ చేసిన దర్యాప్తులో భద్రతా పరంగా ఆందోళనాకరమైన అంశాలు వెలుగు చూసినట్లు తెలిసింది. దీంతో 5జీ నెట్వర్క్‌లో చైనా ప్రమేయం లేకుండా టెక్నాలజీని తయారు చేసుకునేందుకు ఈ కొత్త కూటమి సిద్దమవుతుంది.

అయితే ఈ కొత్త కూటమి కేవలం టెక్నాటజీ కోసం పరిమితం కాకుండా భవిష్యత్‌లో చైనాను రాజకీయంగా ఇబ్బందుల్లో పెట్టేందుకు కూడా కూటమిలోని దేశాలు ఉపయోగించుకునే అవకాశముంది. ప్రస్తుతం భద్రతా మండలిలోనూ భారత్‌కు శాశ్వత సభ్యత్వం విషయంలో చైనా ప్రతి సారి అడ్డుపడుతున్న విషయం తెలిసినదే. ప్రస్తుత చర్యలతో ప్రపంచ రాజకీయాల్లో కొత్త అధ్యాయాలకు తెరతీయనున్నట్లు తెలుస్తుంది.