శ్రీకాకుళం జిల్లాల్లో తీరం దాటిన ‘తిత్లీ’

ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘తిత్లీ’ పెను తుపాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు వద్ద గురువారం ఉదయం తీరాన్ని దాటింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న పెను తుపాను మరింత ముందుకు కదిలి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు దిశ మార్చుకుంటోందని వాతావరణశాఖ తెలియచేసింది. తుపాను తీరాన్ని దాటినప్పటికీ వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది.

కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సైక్లోన్ ఐ గా పిలిచే తుపాను కేంద్రకం దాదాపు 52 కిలోమీటర్లమేర విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రం వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్‌ కేంద్రం తెలిపింది.

తుపానులో అంతర్గతంగా గాలుల వేగం 155 నుంచి 187 కిలోమీటర్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తున్న ఈ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

పెను తుపాను తీరం దాటిన సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశాలోని గజపతి, గంజాం, ఖుర్దా, నయాగడ్ పూరి, జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 10వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కోస్తా తీరంలో కొన్నిచోట్ల అలలు 3 మీటర్ల మేర ఎగసిపడతున్నట్టు ఇన్‌కాయిస్‌ హెచ్చరికలు జారీ చేసింది.

తుఫాను ప్రభవాతంతో పలాస మున్సిపాలిటీలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈదురుగాలుల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తినష్టం కలిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  తెలిపారు. రాత్రి అంతా ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితులపై సమీక్ష చేస్తున్న ఆయన  పంటనష్టం, ఆస్తి నష్టంపై సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు తెరిపి ఇచ్చిన వెంటనే సహాయ పునరావాస చర్యలు చేపట్టాలన్నారు.

పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. భోజనం, పులిహోర, తాగునీటి పాకెట్లు పంపిణీ చేయాలని, సహాయ పునరావాస చర్యల్లో అందరూ పాల్గొనాలని సీఎం సూచిచంారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సహాయచర్యలలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సాయంత్రానికల్లా సాధారణ పరిస్థితులు వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.