ఇక కేంద్రం పాత్ర పరిమితం.... లాక్ డౌన్ రాష్ట్రాలకే!

జూన్ 1వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను మరోసారి పొడిగించినప్పటికీ కేంద్రం తన పాత్రను పరిమితం చేసుకుని లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలా, లేక అదనంగా మరిన్ని సడలింపులు ఇవ్వాలా అనే దానిపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. 

అయితే దేశంలోని మొత్తం కేసుల్లో 80 శాతం వరకు కేసులు నమోదవుతున్న 30 మునిసిపాలిటీల్లో ని కంటైనమెంట్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలను కొనసాగించాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. 

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, యుపి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ మునిసిపాలిటీలున్నాయి. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు, రాజకీయ సభలు, సమావేశాలతో పాటుగా మాల్స్‌ను తెరవడంపై నిషేధాన్ని మాత్రం కేంద్రం మరికొంత కాలం కొనసాగించవచ్చని భావిస్తున్నారు. 

అలాగే జనం ఎక్కువగా చేరే ప్రాంతాల్లో ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి చేయడంతో పాటుగా సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చూడాలని రాష్ట్రాలను కేంద్రం కోరే అవకాశం ఉంది. కాగా స్కూళ్లు తిరిగి తెరవడం, లేదా మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించడంపై రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవడానికి అనుబతించవచ్చు. 

ఇక లాక్‌డౌన్ చర్యలను ప్రతి 15 రోజులకోసారి సమీక్షించడం జరుగుతుంది. తమ అధికార పరిధిలో తీసుకునే ప్రతి నిర్ణయంలోను రాష్ట్రాలకే ప్రధాన పాత్ర ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 

కాగా గత మార్చి 25న లాక్‌డౌన్ ప్రకటించినప్పటినుంచి మూతపడి ఉన్న ప్రార్థనా మందిరాలను తిరిగి తెరవడంపై కూడా రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం అనుమతించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

జూన్ 1వ తేదీనుంచి తమ రాష్ట్రంలోని అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను తిరిగి తెరవడానికి అనుమతించాలని ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప ఇటీవల చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలోని ప్రార్థనా సలాలు తిరిగి తెరవడానికి అనుమతించనున్నట్లు ప్రకటించారు.