ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని కేసీఆర్  

ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను దిగజార్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగరం ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.   గత ఆరేళ్లుగా ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటోన్న తెలంగాణ..కేసీఆర్ పాలనలో దివాళా తీసిందని ఆరోపించారు. 

 భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు జూన్ నెల జీతాలను లాక్ డౌన్ పేరుతో కోత పెట్టడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమని దుయ్యబట్టారు.  2018 నుంచి అమలు చేయాల్సిన వేతన సవరణ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. 

 కనీసం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతి కూడా తెలంగాణ ఉద్యోగులకు దిక్కులేకుండా పోయిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులకు వేతన సవరణ సంగతి దేవుడెరుగు, నెల జీతం కూడా ఇవ్వలేని స్థితిలో ఉండడం  కేసీఆర్ పాలనకు నిదర్శనం అని దుయ్యబట్టారు. 

గత ఆరేళ్లుగా అరిగిపోయిన గ్రాంఫోన్ రికార్డుల్లా లక్ష ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటివరకు కొత్తగా 40వేల ఉద్యోగాలను కూడా నియమించని అసమర్థులు మీరని సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఇక రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య చెప్పాల్సిన పనేలేదని అన్నారు. 

2018 ఎన్నికల సందర్భంగా ఉద్యోగుల రిటైర్మంట్ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుతామన్న మీరు ఆ ఊసే ఎత్తకపోవడం మీ అబద్ధాల చిట్టాకు మరో నిదర్శనమని గుర్తు చేశారు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగి అన్న పదమే ఉండదని ఉద్యమ సందర్భంగా మీరిచ్చిన వాగ్దానం నీటిమీది రాతగానే మిగిలిందని విమర్శించారు. 

మీ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులు కొనసాగుతున్నందుకు మీరు సిగ్గుపడాలని కేసీఆర్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. కేంద్రం అప్పులు ఇస్తే తప్ప రాష్ట్రం నడవలేని స్థితికి దిగజార్చిన మీరు నైతికంగా పాలించే హక్కు కోల్పోయినట్టేనని బీజేపీ భావిస్తోందంటూ స్పష్టం చేశారు.