కొడుకునో, కూతురునో సిఎం చేయాలని చూస్తున్న కెసిఆర్

2014లో తెరాస ప్రభుత్వం ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ 2018లోనూ ఎస్సీని సీఎంగా చేయరని బిజెపి అద్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసారు. తదనంతర కాలంలోనూ ఎస్సీని ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేసారు.  తన కుమారుడు, కుమార్తెను అధికార పీఠంపై కూర్చోబెట్టాలన్నదే కేసీఆర్‌ ఆలోచనగా ఉందని కరీంనగర్ బహిరంగసభలో పేర్కొన్నారు.

వచ్చే ఏప్రిల్‌ - మేలో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు జరిపి ప్రజలపై అదనపు భారం మోపారని అమిత్‌ షా విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొవడానికి భయపడే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు.

కేసీఆర్‌ పాలనలో యువతకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఇప్పటికీ తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెబుతూ నాలుగున్నరేళ్లలో ఒక్క లెక్చరర్‌ పోస్టును భర్తీ చేయలేదని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న వాగ్దానాన్ని కేసీఆర్‌ నిలుపుకోలేదన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ఘోరంగా విఫలమైందని విమర్శిస్తూ ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన 150 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలుచేయలేదని మండిపడ్డారు.  ‘‘పేద, బడుగు వర్గాలకు రెండు పడక గదులు ఇస్తామన్న మాటనూ కేసీఆర్‌ నిలుపుకోలేదు. నేటి వరకు కనీసం ఐదువేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తికాలేదు. తెలంగాణ అమరులను కేసీఆర్‌ మోసగించారు. దాదాపు 1200 మంది అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని పట్టించుకోలేదు” అని తెలిపారు.

 మిషన్‌ కాకతీయ కింద రూ.1500 కోట్లు ఖర్చయినట్టు చెబుతున్నాచెరువులు, కుంటల పునర్నిర్మాణం పూర్తికాలేదని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం రూ.99వేల కోట్లు కేటాయించినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని అమిత్  షా ఆరోపించారు. తెలంగాణలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంటూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు 150 శాతం లాభం చేకూరేలా మద్దతు ధర కల్పిస్తోందని చెప్పారు.

తెలంగాణ ప్రజల విషయంలో కేసీఆర్‌ మరో మోసం చేశారని చెబుతూ మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజల ఆరోగ్యం కోసం రూ.5లక్షల బీమాతో ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తే కేసీఆర్‌ తెలంగాణకు ఆ పథకం వద్దన్నారని విమర్శించారు. ఆ పథకం అమలు చేస్తే తెలంగాణ ప్రజల్లో మోదీ పట్ల ఆకర్షణ, గౌరవం పెరుగుతుందనే తెలంగాణకు వద్దన్నారని ఆరోపించారు.