దేశవ్యాప్తంగా క్వారంటైన్‌లో 23లక్షల మంది

దేశంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో దాదాపు 23 లక్షల మంది ఉన్నారు. వీరిలో దేశంలోని ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేసిన వారే కాకుండా విదేశాలనుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. 

చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల ప్రభుత్వాలు వేరే ప్రాంతాల్లోంచి తమ సరిహద్దుల్లోకి అడుగుపెట్టే వారికి ఏడు రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేయగా, కొన్ని రాష్ట్రా లు మాత్రం అలాంటి వారికి హోం క్వారంటైన్‌ను సిఫార్సు చేస్తున్నాయి.

అధికారుల అంచనాల ప్రకారం ఈ నెల 26 నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో దాదాపు 22.81 లక్షల మంది ఉన్నారు. కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. ఈ నెల14 నాటికి క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారి సంఖ్య 11.95 లక్షలు మాత్రమేనని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు.

అత్యధికంగా మహారాష్ట్రలో 6.02 లక్షల మంది క్వారంటైన్ సెంటరల్లో ఉండగా4.42 లక్షల మందితో గుజరాత్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఈ నెల 14 నాటికి మహారాష్ట్రలో 2.9 లక్షల మంది క్వారంటైన్ సెంటర్లలో ఉండగా, గుజరాత్‌లో 2 లక్షల మంది ఉన్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం లాక్ డౌన్ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 91 లక్షల మంది వలస కార్మికులను రైళ్లు, బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు చేర్చారు. అలాగే వందేభారత్ మిషన్ కింద దాదాపు 40 దేశాల్లో చిక్కుపడిపోయిన 30 వేల మంది భారతీయులను స్వదేశానికి ప్రత్యేక విమానాల్లో తీసుకు వచ్చారు. ఈ పథకం కింద 60 దేశాల్లోని దాదాపు లక్ష మందిని స్వదేశానికి తీసుకు రావాలన్నది ప్రభుత్వ ఆలోచన.

కాగా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి తరలించిన వలస కూలీల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారేనన్న విషయం తెలిసిందే. యుపిలో 3.6 లక్షల మందినిని క్వారంటైన్‌కు పంపించగా, వీరిలో అత్యధికులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. బీహార్‌లో 2.1 లక్షల మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల తర్వాత చత్తీస్‌గఢ్‌లో 1.86 లక్షలు, ఒడిశాలో 1.18 లక్షలు, జార్ఖండ్‌లో 88,536 , పంజాబ్‌లో 30,983 మంది క్వారంటైన్‌లో ఉన్నారు.