ఐదు రాష్ట్రాల నుండి రాకపోకలపై కర్ణాటక నిషేధం 

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పరిమిత సంఖ్యలో రైళ్లు, విమానాలు రాకపోకలు సాగిస్తున్న తరుణంలో ఐదు రాష్ట్రాల   నుండి రాకపోకలను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. 

కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి రాకపోకలను నిషేధించింది. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు, రైళ్లు, ఇతర వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. 

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర కేబినెట్‌ గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో చాలా మందికి వైరస్‌ సోకినట్లు తేలడం సహా వారిని ప్రభుత్వ క్వారంటైన్ చేయడంలో సమస్యలు తలెత్తిన కారణంగానే యడ్డ్యూరప్ప ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు, రైళ్లు, బస్సులపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, అందువల్ల కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.  

ఇక కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ​కేరళ నుంచి వచ్చేవారిని మే 31 వరకు రాష్ట్రంలోకి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం ఇదివరకే తేల్చిచెప్పింది.  తాజాగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లను కూడా ఈ జాబితాలో చేర్చింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2283 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 44 కోవిడ్‌ మరణాలు సంభవించాయి.