మే లోనూ జీతాలు కట్, పేద‌ల‌కు నెల‌కు రూ.1500 క‌ట్

లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా  మే నెలలో కూడా పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించారు. అయితే లాక్‌డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతుంది కనుక ఈ నెల రూ 1500  నగదు ఇచ్చే కార్యక్రమం కొనసాగదని తేల్చి చెప్పారు.  

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై  ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్ష లో రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.  రాష్ట్రానికి ప్రతీ నెలా రూ 12,000 కోట్ల వరకు ఆదాయం రావాలని కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయిందని పేర్కొన్నారు. 

లాక్‌డౌన్ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇచ్చినా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరగలేదని, రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదని గుర్తించారు. దానితో ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాలలో కోతలను కొనసాగించాలని నిర్ణయించారు. 

ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతలు ఉంటాయని తీర్మానించారు. 

కాగా, ఆర్టీసీ బస్సులకు గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సిఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జెబిఎస్ తో పాటు, ఇమ్లీబన్ లో కూడా ఆగేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.

ఆర్టీసీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తూ హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి, మరికొన్ని రోజుల వరకు నగరంలో సిటీ బస్సులు నడపరని స్పష్టం చేశారు. అట్లాగే అంతర్రాష్ట్ర బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు నడపరని తెలిపారు.