తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని బిజెపి అద్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ మైదానంలో బిజెపి నిర్వహించిన సమరభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేసిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు.  “వచ్చే ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీకి అధికారమివ్వండి.. మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లా తెలంగాణాను అభివృద్ధి చేసి చూపుతాము” అని హామీ ఇచ్చారు.

టిడిపి, కాంగ్రెస్‌ కలిసినంత మాత్రాన వారు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం కాలేరని స్పష్టం చేసారు. ‘‘రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఏ రాష్ట్రంలోనూ గెలవలేదు. దేశంలో కాంగ్రెస్‌ ఎక్కడ ఉందో చూడాలంటే దుర్భిణి పెట్టి చూడాలి” అని ఎద్దేవా చేసారు. ఒకవేళ మహాకూటమి విజయం సాధించినా ఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ముందా? అని సవాల్ చేసారు. రాహుల్‌ గాంధీ, కేసీఆర్‌, ఇతర పార్టీల నేతలెవరికీ ఒవైసీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము లేదని అంటూ ఆ దమ్ము కేవలం బిజెపికి మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేసారు.

వాజ్‌పేయీ అంతిమ యాత్రలో ప్రధాని మోదీ ఐదు కి.మీలు నడిచి అటల్‌జీ పట్ల ఎంతో గౌరవం చూపారని గుర్తు చేస్తూ తెలంగాణ పుత్రుడు, భూమి పుత్రుడైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణిస్తే ఆయన అంత్యక్రియలను కూడా కాంగ్రెస్ దిల్లీలో జరపకుండా అవమానం చేసారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ దుశ్చర్యలను ప్రజలు అర్థంచేసుకున్నారని చెబుతూ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేసారు.

రజాకార్లు చేసిన అరాచకాలను తెలంగాణ ప్రజలు మరువగలరా? అని అమిత్‌ షా ప్రశ్నించారు. ఎంఐఎం భయంతో విమోచన దినాన్ని కేసీఆర్‌ జరపడం లేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే బీసీలకు నష్టమని అమిత్‌షా హెచ్చరించారు.

తెలంగాణ అభివృద్దికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రూ 1.15 లక్షల కోట్ల నిధులు ఇవ్వగా, 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు మరో రూ 1.15 లక్షల కోట్లు ఇచ్చినదని, మొత్తం మీద రూ 2.30 లక్షలకు కోట్లకు పైగా నిధులు ఇచ్చినదని అమిత్ షా తెలిపారు. కెసిఆర్ కేంద్రంలో మంత్రిగా ఉన్న సమయంలో యుపియే ప్రభుత్వం 13వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు రూ 15 వేల కోట్లకు మించి నిధులు ఇవ్వలేదని చెబుతూ తెలంగాణ అభివృద్ధి బిజెపికి మాత్రమె సాధ్యం అవుతుందని స్పష్టం చేసారు.