తెలంగాణలో ఒక్క రోజే 107 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 107 కేసులు నమోదయ్యాయి, ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చినవాళ్లు 49 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలస కార్మికుల్లో మరో 19 మందికి వైరస్ పాజిటివ్‌ వచ్చింది. 

మిగతా కేసులు గ్రేటర్ హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లోనూ నమోదయ్యాయి. అయితే జిల్లాలవారీగా వివరాలు ఇవ్వలేదు.  మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంఖ్య 2,098కి చేరింది. ఇప్పటివరకు 1,321 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 714 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. బుధవారం చనిపోయినవారిలో ఏడు రోజుల చిన్నారి, నాలుగు నెలల బాబు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో కరోనాతో మరో ఆరుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 63కి చేరింది. బుధవారం మృతి చెందిన వారిలో 4 నెలల బాబు, ఏడు రోజుల పాప కూడా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్పరిధిలోని కుత్బుల్లాపూర్కు చెందిన ఓ మహిళకు నీలోఫర్‌‌లో డెలివరీ అయింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉండడంతో డాక్టర్లు డిశ్చార్జి చేశారు. 

ఇంటికెళ్లిన తర్వాత పాపకు కరోనా లక్షణాలు మొదలయ్యాయి. టెస్టులు చేయిస్తే వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇంతలోనే పాప మరణించింది. ప్రసవానికి ముందు చేసిన టెస్టుల్లో పాప తల్లికి కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో హాస్పిటల్‌లోనే పాపకు వైరస్ సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నయి.