నేటి పరిస్థితుల్లో రూ 50 లక్షల కోట్లు అవసరం

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితులను అధిగమించాలంటే రూ 50 లక్షల కోట్లు అవసరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. గత రెండు మూడు నెలలుగా దేశంలో వ్యాపార లావాదేవీలు లేవని, ప్రతి రంగం, ప్రతి పౌరుడూ చిక్కుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే మార్కెట్లో మరింత నగదును అందుబాటులోకి తెస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 

కేంద్రం ఇప్పటికే రూ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, వివిధ రాష్ట్రాల నుంచి మరో రూ 20 లక్షల కోట్లు, పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంతో మరో రూ 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుందని ఆయన తెలిపారు. 

ఇక, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలను తిరిగి పట్టాలెక్కించడానికి ఇప్పటికే బ్యాంకులు రంగంలోకి దిగి, తగిన సహాయం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.  మార్చిలో ఆరు లక్షలకు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పరిమితమైతే, ఈ సంవత్సరం చివరి నాటికి 25 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పునర్మించడానికి తాము చూస్తున్నామని గడ్కరీ తెలిపారు. 

45 రోజుల్లోగా ఈ పరిశ్రమలకు చెల్లించాల్సిన బకాయిలను అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్  కంపెనీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.  కేంద్రం కూడా ఈ దిశగానే తగు సూచనలు చేసిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా ఇదే ఫార్ములాను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రస్తుతం తమ ముందున్న పెద్ద సవాల్  ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడమేనని స్పష్టం చేశారు. జీడీపీని 2-3 శాతం వృద్ధికి తీసుకురావడానికి తమ ప్రభుత్వం శతధా ప్రయత్నిస్తోందని, అయితే నెగెటివ్ జీడీపీయే తమకు సమస్యగా మారిందని తెలిపారు. దీనిని అధిగమించడానికే మార్కెట్లో ద్రవ్య ప్రవాహం కావాలని నితిన్ గడ్కరీ సూచించారు.