ఏపీలో బట్టలు, చెప్పులు, నగల దుకాణాలకు సడలింపు  

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో మరికొన్ని సడలింపులు ఇస్తూ  ఏపీ  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో మందుల షాపులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, ప్రజా రవాణాకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా బట్టలు, చెప్పుల షాపులు, నగల దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. స్ట్రీట్‌ ఫుడ్‌కు కూడా అనుమతిచ్చింది. 

అయితే, పానీ పూరీ బండ్లకు మాత్రం తెరిచేందుకు వీలులేదని ఆదేశాల్లో పేర్కొంది. స్ట్రీట్‌ ఫుడ్‌ విక్రేతలు గ్లౌజులు, శానిటైజర్లు వినియోగించాలని, వినియోగదారులు అక్కడే తినకుండా చూడాలని ఈ ఆదేశాల్లో తెలిపారు. దీంతో బుధవారం నుండి వ్యాపార లావాదేవీలు చాలా వరకూ మొదలుకానున్నాయి. 

పెద్దపెద్ద షాపింగు మాల్స్‌లోకి వెళ్లేవారు ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా . రవాణాకూ ఇబ్బంది లేకపోవడంతో రోడ్లపై వాహనాల రాకపోకలూ పెరిగాయి.

కాగా, తిరుపతిలోని స్విమ్స్‌కు ప్లాస్మాథెరఫీ నిర్వహణకు అనుమతి లభించింది. ఐసిఎంఆర్‌ నుండి ఈ మేరకు సమాచారమందినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రకటించారు. అర్హులైన కరోనా రోగులకు ప్లాస్మాను ఎక్కించనున్నట్లు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తామని తెలిపారు.

ఏపీలో మంగళవారం 8,148 శాంపిల్స్‌ పరీక్షించగా 48 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించగా, 55 మంది డిశ్చార్జ్‌ అయినట్లు  జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనాతో తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మరణించినట్లు తెలిపారు. మొత్తంగా కేసుల సంఖ్య 2719 ఉండగా, 1903 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకూ 57 మంది మరణించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 759 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.