కాశ్మీర్ లో పరదేశీయులుగా మిగిలిన వారికి శాశ్వత నివాసం

వి రామ్ మాధవ్ 

జమ్మూ కాశ్మీర్ లో శాశ్వత నివాసీలకు సంబంధించి నియమాలను పేర్కొంటూ గజెట్ నోటిఫికేషన్ వెలువడటంతో  ఆగష్టు 5, 2019 నాడు ప్రారంభించిన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లయింది. రాజ్యాంగంలోని 35-ఎ అధికరణం రద్దవటంతో శాశ్వత నివాసీలకు సంబంధించిన నియమాలను మళ్ళీ పేర్కొనాల్సిన అవసరం ఏర్పడింది. 

రాజ్యాంగంలోని 35-ఎ అధికరణం 'శాశ్వత నివాసితులు' అనే వర్గాన్ని నిర్వచించుకొనే అధికారాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసన సభకు కల్పించింది. ఆ అధికారం ఏకపక్షంగా, వివక్షాపూరితంగా కొనసాగింది. అనేకమంది ప్రజలకు ప్రాధమిక హక్కులను నిరాకరించటానికి 'శాశ్వత నివాసీ ధృవీకరణపత్రం' జమ్మూ కాశ్మీర్ లో వరసగా వచ్చిన వివిధ ప్రభుత్వాల చేతుల్లో ఆయుధంగా మారింది. అలా ప్రాధమిక హక్కులు నిరాకరించబడ్డ వాళ్లంతా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా నివసిస్తున్నవారు, చాలామంది జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో విలీనం అయిన సమయం నుంచి జమ్మూ కాశ్మీరులో నివసిస్తున్నవారున్నారు.

శాశ్వత నివాసీయులకు సంబంధించిన  నూతన నియమావళి ఇప్పటివరకు 'శాశ్వత నివాసీ ధృవీకరణపత్రం' కలిగి ఉన్న వారికే కాకుండా 35-ఎ అధికరణం కారణంగా శాశ్వత నివాసీ హోదా నిరాకరించబడ్డవారికి సైతం ఆ హోదా కల్పిస్తున్నది. దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు కాందిశీకులుగా వలసి వచ్చిన వారిలో అత్యధికులు షెడ్యూల్ కులాలకు చెందిన వారు. వాళ్లందరూ నూతన నియమావళి కారణంగా ఇప్పుడు శాశ్వత నివాసీ హోదా పొంద గలుగుతున్నారు. 

1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్ లోని చాంబ్ ప్రాతం నుంచి జమ్మూ కాశ్మీర్ వలస వచ్చిన వారు కూడా అదే హోదా పొందగలుగుతున్నారు. 1950లో అనేక మంది పారిశుధ్య కార్మికులను పారిశుధ్య పనులకు గాను రాష్ట్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోకి ఆహ్వానించింది.  వారిలో చాలామంది షెడ్యూలు కులాల వారు ఉన్నారు. వారందరికీ ఇప్పటివరకు శాశ్వత నివాస హోదా నిరాకరించబడింది. రాష్ట్రంలో ఉంటున్న గుర్ఖా లకు కూడా శాశ్వత నివాస హక్కు ఇంతకాలం నిరాకరించబడింది.

కాశ్మీరీ పండిట్లకు జమ్మూ కాశ్మీర్ బయట పుట్టిన సంతానం, తల్లి తండ్రులలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన తల్లి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాశ్వత నివాస హోదా లేని తండ్రికి పుట్టిన సంతానం కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో శాశ్వత నివాస హోదా పొందవచ్చు.  పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి భారత దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్నవారంతా జమ్మూ కాశ్మీర్ తిరిగి వచ్చి శాశ్వత నివాస హోదా హక్కుగా పొందవచ్చు.

క్రొత్త విధానం ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ శాశ్వత నివాసితులకు రిజర్వేషన్ చేయబడతాయి. ఈ కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో ఉంటూ కూడా పరదేశీయులుగా పరిగణింపబడి నూతన నియమావళి కారణంగా శాశ్వత నివాసీ హోదా పొందిన అనేక మందికి మేలు జరుగుతుంది.

హతం కావించబడ్డ ఉగ్రవాదులకొరకు, అదుపులోకి తీసుకోబడ్డ వారి నేర భాగస్వాముల కొరకు మొసలి కన్నీరు కార్చే విశిష్ఠ వ్యక్తుల దృష్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలనేక మందికి ప్రయోజనం చేకూర్చే ఇటువంటి ముఖ్యమైన పరిణామాలేవీ  ఆకర్షించక పోవటం శోచనీయం. దురదృష్టవశాత్తు జమ్మూ కాశ్మీర్ అంశం ఎప్పుడూ కూడా పాకిస్తాన్ కోణంలో కానీ, ఉగ్రవాదుల కోణంలో గానీ వీక్షించబడుతున్నది. 

జమ్మూ కాశ్మీర్ లోని లక్షలాది మంది ప్రజలు ఉగ్రవాదం, వేర్పాటువాదాలతో సంబంధం లేకుండా సామాన్య దేశ ప్రజలుగా శాంతియుత జీవితాన్ని గడపాలని కోరుతున్నారన్న విషయం కొందరు విశిష్ఠ వ్యక్తుల కళ్ళకు ఏమాత్రం ఆనదు.

ఎ. ఎం. వథాలి అనే పోలీసు అధికారి తన ఆత్మ కథలో "1947 నుంచి జమ్మూ కాశ్మీర్ అంశం రెండు దేశాల ఎజండాలో ఉండటం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు స్థిర చిత్తంతో తమను తాము భారత పౌరులుగా పరిగణించుకోవటానికి అవకాశం ఇవ్వటంలేదు. అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి గాను భారత పాక్ లు చర్చించుకొంటాయంటూ పదే పదే పేర్కొనటం కారణంగా కాశ్మీరీయులు సహజంగానే తమ భవిష్యత్తు ఇంకా నిర్ధారించబడవలసి  ఉందని భావించారు. ఇది వారి కోపం, పరాయీకరణ, అనిశ్చితిలను  ప్రకోపింపచేసి హింసకు కారణభూతమౌతున్నది" అంటూ దుఃఖిస్తూ పేర్కొన్నాడు.

జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ కోణంతోనో, ఉగ్రవాదుల కోణంతోనో చూడటం మానివేయటం అనేది నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన విధానపరమైన మార్పు. మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అంశాన్ని రాష్ట్రంలో నివసిస్తున్న కోటి ఇరవై లక్షలమంది ప్రజల కోణంతో చూడటం ప్రారంభిచింది. ఆగష్టు 5, 2019న 370వ రాజ్యాంగ అధికారణాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో  తీర్మానం చేయటం ప్రభుత్వ విధానంలో ఈ మార్పుకు సంకేతం.

నక్కలు విడి విడిగా జీవిస్తాయి కానీ కలసికట్టుగా ఈల వేస్తాయని జమ్మూ కాశ్మీర్ లో ఓ సామెత నానుడిలో ఉంది. ఇస్లామాబాద్ నుంచి న్యూ యార్క్ వరకు అనేక మంది ఇస్లామీవాదులు ప్రభుత్వ విధానంలో ఈ మార్పుకు వ్యతిరేకంగా గగ్గోలు పెడుతున్నారు. విస్తారంగా చూచినట్లయితే జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు మాత్రం శాంతంగానే ఉన్నారు. 

సీమాంతర ప్రోత్సాహం కారణంగా వేసవి కాలం వచ్చినప్పటినుంచి ఉగ్రవాద సంఘటనలు కొంచం ఎక్కువగా జరుగుతున్నాయి. అయినా గత సంవత్సరాలతో పోల్చిచూచినట్లయితే స్థానికులు ఉగ్రవాదులుగా భర్తీకావటం మాత్రం తగ్గుముఖం పట్టింది.

గతంలో కూడా 370వ రాజ్యాంగ అధికారణానికి అనేక  సార్లు సవరణలు జరిగాయి. 1954లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ పరిషత్ భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని ఆమోదించిన వెనువెంటనే భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని అనేక అధికారణాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తింప చేసింది. నవంబర్ 27, 1963న భారత పార్లమెంటులో  జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం రాజ్యాంగంలోని 370వ అధికారణాన్ని నిర్వీర్యం చేసే చర్యలు అతి త్వరలో అంటే రానున్న ఒకటి రెండు నెలల్లో తీసుకొంటామంటూ వాగ్దానం చేసింది.

కాశ్మీరీ రాజకీయ నాయకులు శ్రీనగర్ లో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినప్పటికీ జమ్మూ కాశ్మీర్ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. పండిట్ దీనానాథ్ డోగ్రా పేర్కొన్నట్లుగా షేక్ అబ్దుల్లా కాశ్మీర్ లో మతతత్వ వాదిగా, జమ్మూలో కమ్యూనిస్ట్ గా, మిగతా భారత దేశంలో జాతీయవాదిగా ప్రఖ్యాతి గాంచాడు. 

1975లో శ్రీమతి ఇందిరా గాంధీ, షేక్ అబ్దుల్లా మధ్య జరిగిన ఒప్పందంలో కూడా 370వ అధికరణం క్రింద అంతకముందు ఉండి తరువాత రద్దు చేయబడ్డ అధికారాలేవీ పునరుద్దరించబడలేదు. శ్రీమతి ఇందిరా గాంధీ "గడియారాన్ని వెనక్కు తిప్పటం సాధ్యం కాదంటూ" షేక్ అబ్దుల్లా కు స్పష్టంగా చెప్పింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆనాటి ఢిల్లీ ఒప్పందాన్ని ఆమోదించారు.

నరేంద్ర మోదీ, అమిత్ షా లు 370వ అధికారణాన్ని నిర్వీర్యం చేయటం, 35-ఆ అధికారణాన్ని తొలగించటం ద్వారా జమ్మూ కాశ్మీర్ విషయంలో అనిచ్చితికి తెరదించారు. పెద్ద ఎత్తున రక్షణ బలగాలు రాష్ట్రంలో ఉండటమే జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత పరిస్థితికి కారణమని కొద్దిమంది వాదించవచ్చు. 370వ అధికారణం నీడలో ఏడు దశాబ్దాలు గడిపిన జమ్మూ కాశ్మీర్ ప్రజలు నూతన విధానానికి ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. 

ఆ కారణంగానే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గత తొమ్మిది నెలలుగా ప్రశాంతంగా ఉంది.  అరడజను మంది సీనియర్ రాజకీయ నాయకులను మినహా రాజకీయ నాయకులందరినీ విడుదల చేయటం జరిగింది. రక్షణ బలగాల మోహరింపు కూడా గణనీయంగా తగ్గించబడింది. అయినా ప్రజలు వీధుల్లోకి వచ్చి రాళ్లు రువ్వటమో, ఆజాదీ అని అరవటమో చేయటంలేదు.

ప్రభుత్వం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజల నిష్కపట ధోరణిని స్వాగతిస్తూ వారికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చాలి. ప్రత్యేక పరిస్థితులలో తీసుకొన్న 4జి సేవలను నియంత్రించటం వంటి కఠిన నిర్ణయాలను ఇప్పుడు వెనక్కు తీసుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాగం, రక్షణ వ్యవస్థలు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక పరిస్థితులు గడచి పోయినాయి కాబట్టి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలి.

ఉక్కు చట్రంలో నియంత్రించటం ద్వారా కాకుండా, స్థానిక ప్రజలు తమను తాము పరిపాలించుకొన్నపుడే నిజమైన రాజకీయ అనుసంధానం సాధించినట్లుగా భావించాలి. అపుడే సరిహద్దులకు ఆవల ఉన్న నక్కలకు జమ్మూ కాశ్మీర్ సమగ్రంగా, పరిపూర్ణంగా భారత దేశంలో అంతర్భాగం, మిగిలి ఉన్న సమస్యల్లా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కు సంబంధించినదేనని సందేశం వెళుతుంది.
(రాం మాధవ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ గోవేర్నర్స్ సభ్యులు.) ఇండియన్ ఎక్సప్రెస్ నుండి