టిటిడి భూముల వేలంపై బిజెపి రేపే ధర్నా 

టిడిపి ఆస్తుల విక్రయంపై అవసరమైతే వీధి పోరాటాలు చేస్తామని  హెచ్చరిస్తూ ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. 

టీటీడీ భూములు విక్రయిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేస్తూ దేవాలయాల భూములు విక్రయిస్తే సహించేదిలేదని టీటీడీ స్పష్టం చేశారు. ఆలయాల భూములు విక్రయిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, ఎంతటి వారినైనా క్షమించేది లేదని తేల్చి చెప్పారు. 

భక్తులు కానుకగా ఇచ్చిన భూములను కాపాడటం మీకు చేతకావడంలేదా? అని టీటీడీ అధికారులను ప్రశ్నించారు. భక్తులు ఇచ్చిన ఆస్తులను కాపాడే సామర్ధ్యం లేకనే అమ్మకాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

పైగా, తాము చేస్తున్న ఈ దుర్మార్గపు పనులకు నిరర్ధక  ఆస్తులనే కొత్త పేరు పెట్టారని ఎద్దేవా చేశారు. నిరార్దక ఆస్తుల పేరుతో భూములు విక్రయించడం దారుణమని  అంటూ  ఆలయాల భూమి గజం కూడా అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. 

కరోనా హడావుడిలో అందరూ ఉంటే సింహాచలం భూములను కబ్జా చేశారని ఆరోపించారు. సింహాచలం భూములను కబ్జాచేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాల భూములు పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నిరసనలు చేపడతామని ఆయన తెలిపారు.