టిటిడి ఆస్తుల జోలికొస్తే పతనం తప్పదు జగన్ 

* ఒక సీఎం క్రైస్తవ రాజ్యం, మరో సీఎం ముస్లిం రాజ్యంకై కుట్ర 

* టిటిడి ఆస్తులపై స్వేతపత్రం విడుదల చేయండి 

తిరుమలేశునికి వివిధ రాష్ట్రాలలో వున్న ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు సన్నద్ధమైన ఏపీ ప్రభుత్వం పెద్ద పాపాన్ని మూటగట్టుకుంటోందని బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్  కుమార్  హెచ్చరించారు. 

టీటీడీ ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చాలనుకున్న ఏపీ ప్రభుత్వ ఆలోచన ఏమాత్రం  సరికాదని స్పష్టం చేశారు. ఆస్తుల  విక్రయంపై టీటీడీ నిర్ణయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతూ ఆస్తులను అమ్మాలనుకునే జగన్ సర్కారు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే శ్రీవారి భక్తులతో పాటు హిందూ బంధువలంతా సంఘటితంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం  రాజ్యంగా మార్చాలనే కుతంత్రాలకు  తెరతీస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఇలాంటి రాజకీయ  కీచకుల  చెర  నుంచి హిందూ ఆలయాలను రక్షించుకుంటామని స్పష్టం చేశారు.  మతోన్మాదుల కుట్రలను ఎదుర్కొనేందుకు బిజెపి పోరుబాట కొనసాగుతుందిని ప్రకటించారు.  

అసలు  వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. అందుకే  టీటీడీ ఆస్తుల పరిరక్షణ  కోసం భక్తులతో  పాటు ప్రజా పక్షాన బిజెపి పోరు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. టీటీడీ ఆస్తుల ఆమ్మకంతో వచ్చిన  ఆదాయాన్ని చర్చిల నిర్మాణానికి పాస్టర్ల జీతాలకు ఇవ్వాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. 

అదే   నిజం  అయితే ఆంధ్రప్రదేశ్ లోని దిక్కుమాలిన ప్రభుత్వం తీసుకున్న  ఈ  నిర్ణయంతో  యావత్  హిందూ సమాజం భగ్గుమంటుందని సంజయ్ స్పష్టం చేసారు. అసలు వక్ఫ్ బోర్డు  ఆస్తులు, చర్చిలకు  సంబంధించిన భూముల గురించి పట్టని రాష్ట్ర సర్కారుకు కేవలం హిందూ దేవాలయాల ఆస్తులను కాజేయాలనే ఆలోచన పాపమని హెచ్చరించారు. .

హిందూ దేవాలయాల ఆస్తులు,ఆభరణాలు, ధనము, ఏవిధమైన స్వప్రయోజనాలకు వాడినా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ దేవాలయ భూములను దుర్వినియోగం చేసి పాపం మూటగట్టుకున్నారు. ఇపుడు ఆపార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే అని గుర్తు చేసారు. 

అందుకే టీటీడీ ఆలయాల ఆస్తుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే  కాకుండా వెంటనే శ్రీవారి  ఆస్తులపై  శ్వేతపత్రం విడుదల చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.