విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్‌ తప్పనిసరి

దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు, దేశంలో ప్రయాణించే విమాన ప్రయాణికులకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలను జారీచేసింది. ప్రయాణికులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. పైగా,  విమాన, నౌకల్లో దేశానికి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. 

ఏడు రోజులు సొంత ఖర్చుతో క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. తర్వాత ఇంట్లో ఏడు రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి. ప్రత్యేక కారణాలతో వచ్చిన వారికి తప్పనిసరిగా 14 రోజులు హోం క్వారంటైన్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఏజెన్సీలు టికెట్‌తో పాటు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చేయదగిన, చేయకూడని పనుల జాబితా ముద్రించాలి అని ఆదేశించింది. 

విమానం, ఓడల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి చేసింది. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే ఓడలు, విమానాల్లోకి అనుమతించాలి. రోడ్డు మార్గాన ప్రవేశించే ప్రయాణికులూ మార్గదర్శకాలు అనుసరించాల్సిందేనని చెప్పింది. లక్షణాలు లేని వారికే సరిహద్దు ద్వారా దేశంలోకి అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 

విమానం, ఓడల్లో వచ్చే వారు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ నింపాలని సూచించింది. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ను ఆరోగ్య, ఇమిగ్రేషన్‌ అధికారులకు అందించాలి. దేశానికి చేరుకున్న తర్వాత కూడా ప్రయాణికులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. స్క్రీనింగ్‌లో లక్షణాలు కనిపిస్తే వారిని వేరు చేసి వైద్య సదుపాయానికి తరలించాలని కేంద్రం ఆదేశించింది. 

మిగిలిన ప్రయాణికులను స్థానిక క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలి. ఐసీఎంఆర్‌ ప్రోటోకాల్‌ ప్రకారం అందరికీ వైద్య పరీక్షలు చేయాలి అని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, దేశీయ విమాన, రైలు, అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఏజెన్సీలు టికెట్లతో పాటు వివరాలు ముద్రించాలని కేంద్రం ఆదేశించింది. ప్రయాణికులు తప్పకుండా ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. 

విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌ టెర్మినల్స్‌లో కరోనాపై ప్రకటనలతో పాటు అనుసరించాల్సిన జాగ్రత్తలపై ప్రకటనలు చేయాలని ఆదేశించింది. ప్రయాణికులు తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. ఇందుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన ఆదేశాలు జారీ చేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. 

కరోనా లక్షణాలు లేని ప్రయాణికులకే విమాన, రైలు, బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తారు. బోర్డింగ్‌, ప్రయాణంలో అందరూ ముఖం కప్పుకోవాలి లేదా మాస్కు ధరించాలని ఆదేశించింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌ టెర్మినల్స్‌ వద్ద భౌతిక దూరం పాటించాలి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. 

ప్రయాణికులు 14 రోజులు ఆరోగ్యంపై స్వీయ పర్యవేక్షణ సలహాతో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. లక్షణాలు కనిపిస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ కాల్‌ సెంటర్‌కు తెలియజేయాలి. రోగ లక్షణాలు ఉన్నవారిని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలి. కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్‌ కేంద్రానికి తరలించాలి. 

కరోనా పాజిటివ్‌ తేలితే కరోనా కేర్‌ సెంటర్‌లోనే ఉండాలి. నెగిటివ్‌ వస్తే ఇంటి వద్ద 7 రోజులు ఐసోలేషన్‌కు అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత లక్షణాలు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి. క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌పై రాష్ట్రాలు  ప్రోటోకాల్‌ అభివృద్ధి చేయొచ్చు అని కేంద్రం తెలిపింది.