ఏపీలో ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేత 

ఎపిలో రాకపోకలకు ఎలాంటి పాసులు లేదా అనుమతులు అవసరం లేదని డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లాలన్నా పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు.  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగ వచ్చని తెలిపారు. 

కారులో డ్రైవర్‌ కాకుండా మరో ముగ్గురు ప్రయాణం చెయ్యొచ్చునని చెప్పారు. ఇతర భారీ వాహనాల్లో వాటి సీట్ల సామర్థ్యంలో 50 శాతం ప్రయాణికులతో ప్రయాణించాలని పేర్కొన్నారు. 

ఇప్పటివరకూ ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు జిల్లాలు వెళ్లేందుకు ఎటువంటి పాసులూ అవసరం లేదని డిజిపి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. 

లాక్‌డౌన్‌ ఆంక్షలు కేవలం కంటైన్మెంట్‌ జోన్‌లకే పరిమితం చేసిన కారణంగా డిజిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇతర జిల్లాలకు వెళ్లేవారు అత్యవసరమైతేనే వెళ్ళాలని సూచించారు.  

కాగా తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాలకు  వెళ్లాలన్నా,అక్కడి నుండి రావాలన్నా రెండు రాష్ట్రాల పోలీసుల నుండి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా, గడిచిన 24 గంటల్లో 47 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 47 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 2,561కి చేరింది. ప్రస్తుతం 727 మంది చికిత్స పొందుతుండగా, 1,778 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

తాజాగా నమోదైన 47 కేసుల్లో 5 కేసులు కోయంబేడు మార్కెట్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. కాగా, కరోనాతో నేడు కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందగా, ఇప్పటివరకు 56 మంది కరోనాతో మరణించినట్లు వెల్లడించింది.