ప్రకృతి వ్యవసాయం పేరిట రూ 16,600 కోట్ల ఒప్పందమా !

జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (జడ్‌బీ ఎన్‌ఎఫ్) పేరిట ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రూ.16,600 కోట్లతో ఒప్పందం చేసుకోవడం పట్ల ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ విస్మయం వ్యక్తం చేసారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐక్యరాజ్య సమితి పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లినపుడు ‘సస్టేనియబుల్ ఇండియా ఫైనాన్స్ కార్పోరేషన్ బ్యాంకు’తో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందని చెప్పారు. జీరో బేస్డ్ అంటూ రూ.16,600 కోట్ల ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారో అర్ధం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

ఇంత పెద్ద ఒప్పందంపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. ఈ  ఒప్పందం చూస్తుంటే ఏపీ సిగ్గుపడే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలన్నీ 47 పేజీల విషయాన్ని నెట్‌లో పెట్టడం దారుణని తెలిపారు. దీనిపై బెంగుళూరుకు చెందిన లియో సద్వానా ఎన్విరాన్‌మెంట్ టీమ్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదని గుర్తు చేసారు.

ఈ విషయాన్ని బెంగుళూరు ఎన్జీవో సంస్థ వెలుగులోకి తెచ్చిందని అంటూ ఎందుకు ఇన్ని కోట్లు వెచ్చించాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉండవల్లి స్పష్టం చేసారు. చంద్రబాబు ఐరాస ప్రసంగంపై ఉండవల్లి సందేహం వ్యక్తంచేశారు. ఐక్య రాజ్య సమితిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు చెబుతున్నారని అయితే, ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రోజువారీగా కార్యక్రమాల వివరాలను అప్‌లోడ్ చేసే ఏపీ పోర్టల్‌లో మాత్రం ఈ విషయం లేదని పేర్కొన్నారు.

చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని విషయాలు ఉంచినపుడు, ఐరాసలో మాట్లాడిన ప్రసంగం ఎందుకు పెట్టలేదని ఉండవల్లి ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఐదు రోజుల అమెరికా పర్యటనలో ఎక్కడా ఐక్య రాజ్య సమితి విషయం లేదని చెప్పారు. సెప్టెంబర్ 23న వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయను కలిసినట్టు, 24న భారత దౌత్యాధికారి అక్బరుద్దీన్‌తో భేటీఅయి, జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ గురించి చర్చించినట్టు, 25న న్యూయార్కులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు మాత్రమే ఉందని వివరించారు.

పరిశ్రమల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలతో శ్వేతపత్రం విడుదలచేయాలని ఉండవల్లి డిమాండ్ చేసారు. రాష్ట్ర అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్ వేసిన ప్రశ్నకు 728 ప్రైవేటు, 3 ప్రభుత్వ యూనిట్లు, 30,349 మైక్రో, మీడియం, స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలు వచ్చాయని, 3,30,316 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు రూ.14,291 కోట్ల పెట్టుబడులు మాత్రమె వచ్చినట్టు ప్రభుత్వం సమాధానమిచ్చిందని ఉండవల్లి తెలిపారు.

అయితే రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అసెంబ్లీలో సీఎం చెప్పడం వింతగానే ఉందని పేర్కొన్నారు. భారతదేశంలో సమీకరించిన మొత్తం పెట్టుబడుల్లో 20 శాతం ఏపీకే వచ్చాయని చంద్రబాబు చెప్పారని తెలిపారు.

మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి కేసుల్లో స్టే అనేది ఆరు నెలలు దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా రద్దవుతుందని ఉండవల్లి చెప్పారు. సెప్టెంబర్ 28కి ఆరు నెలల గడువు పూర్తయిందని తెలిపారు. ఇక నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి తాను వేసిన కేసుల సాక్ష్యాధారాలను ఆయన కుడి, ఎడమ భుజాలుగా వున్న వ్యక్తులు ఇచ్చిన సమాచారంతోనే కేసు వేశానని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి పూర్తవుతుందని చెప్పడం వింతగా వుందని ఉండవల్లి పేర్కొంటూ అసలు డ్యామ్ కట్టకుండా ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ఉండవల్లి ప్రశ్నించారు. పోలవరం చూసి వచ్చేందుకు విహార యాత్రలు పెట్టడం, దీని కోసం రూ.20 కోట్లు బడ్జెట్ కేటాయిస్తూ జీవో జారీ చేయడం వంటి ప్రచార ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.