సాగునీటి ప్రాజెక్ట్ లలో కేసీఆర్ భారీ అవినీతి.. బిజెపి ఫిర్యాదు 

అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సాగునీటి ప్రాజెక్ట్ లలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బిజెపి ఆరోపించింది. 

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆధ్యర్యంలో బిజెపి ప్రతినిధి వర్గం గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలసి దేశం మొత్తం కరోనా మహమ్మారితో, లాక్ డౌన్ లో ఉన్న సమయంలో కేసీఆర్ రూ 24,096 కోట్ల విలువగల టెండర్లు పిలిచి, తమకు ఇష్టం వచ్చినవారికి కేటాయించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. 

వెంటనే లాక్ డౌన్ సమయంలో ఇచ్చిన కాంట్రాక్టు లను రద్దు చేసి, కేసీఆర్ పాల్పడుతున్న సాగునీటి కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. 

2014లో అధికారమలోకి రాగానే అమలులో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే తనకు ముడుపులు ముట్టవని గ్రహించి, ప్రాజెక్ట్ ల రీడిజైన్ ల పేరుతో వాటన్నిటికీ పేర్లు మార్చి, వాటి అంచనాలను విపరీతంగా పెంచివేసి, తాజాగా రూ 2.5 లక్షల కోట్ల మేరకు విలువ గల టెండర్లను తనకు ఇష్టమైన వారికి ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు. 

వీటిల్లో చాలావరకు గ్లోబల్ టెండర్లు పిలవలేదని, కేవలం తనకు కావలసిన వారు మాత్రమే అర్హత పొందేటట్లు చేసుకున్నారని వివరించారు. ఉదాహరణకు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పధకం నిర్మాణ వ్యయాన్ని రూ 32,500 కోట్ల నుండి రూ 52,000 కోట్లకు పెంచారని చెప్పారు. దాని సామర్ధ్యాన్ని ఈ మధ్య  2 టిఎంసి ల నుండి 1 టిఎంసి కి తగ్గించినా, కాంట్రాక్టు కు మాత్రం పూర్తిగా చెల్లించారని పేర్కొన్నారు. 

తాజాగా లాక్ డౌన్ అమలులో ఉండగానే మార్చ్ 30న టెండర్లు పిలిచి, మే 5న ఖాయం చేసారని చెబుతూ లాక్ డౌన్ సమయంలో సిబ్బంది ఎవ్వరు కార్యాలయాలకు రాక పోవడంతో ఇతర కాంట్రాక్టు లకు డిజైన్ లు, అంచనాలు తయారు చేయడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. 

మిషన్ కాకతీయ పేరుతో రూ 35,000 కోట్ల వ్యయంతో చేపట్టిన చెరువుల పూడికలు తీసివేత పనులలో 10 శాతం కూడా పూర్తిచేయలేదని వారు ఆరోపించారు. కాగా, ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచివేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేసారని తెలిపారు. ఎడిబి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుండి తీసుకొనే అప్పులతో పాటు వాణిజ్య బ్యాంకుల నుండి అధిక వడ్డీలకు రూ 1 లక్ష కోట్ల రుణాలు తీసుకున్నారని చెప్పారు. 

గవర్నర్ ను కలసిన వారిలో మాజీ ఎంపీ డా. జి వివేకా వెంకటస్వామి, మాజీ మంత్రులు డా. జి విజయరామారావు, పి సుధాకర రెడ్డి, ఎమ్యెల్సీ ఎన్ రామచంద్రరావు ఉన్నారు.