మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి

దేశంలోనే అత్య‌ధిక కరోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో   వైర‌స్ విజృంభ‌ణ  ఒకవంక కొనసాగుతూ ఉండగా, మరోవంక విధి నిర్వ‌హణ‌లో భాగంగా పోలీసులు   గణనీయంగా   కోవిడ్ కార‌ణంగా మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తున్నది. 

ఇప్ప‌టివ‌ర‌కు 1666 మంది పోలీసుల‌కి క‌రోనా సోక‌గా, 18 మంది మ‌ర‌ణించారు. ముంబైలోని విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వ‌హిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరుణ్ ఫడ్టారే వైర‌స్ ధాటికి  మ‌ర‌ణించినట్లు ముంబై పోలీస్ కమిషనర్ పరం బిర్ సింగ్ తెలిపారు. 

వ‌య‌సు పైబ‌డిన‌ కార‌ణంగా గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న సెల‌వులో ఉండ‌గా శుక్ర‌వారం క‌న్నుమూసిన‌ట్లు చెప్పారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న‌కు సంతాపం ప్ర‌క‌టించారు. 

మే 21న క‌రోనా కార‌ణంగా ఎఎస్‌ఐ భివ్‌సేన్ హరిభావును కోల్పోయామ‌ని, వ‌రుస‌గా పోలీసులు వైర‌స్‌కు బ‌లికావ‌డం ప‌ట్ల రాష్ట్ర డీజీపీ  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబ ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. 

ఇప్ప‌టికే వ‌య‌సు పైబ‌డిన వారిని విధుల్లోకి రావొద్దంటూ పోలీస్ వ‌ర్గాలు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ అధిక‌సంఖ్య‌లో మహారాష్ట్రలో పోలీసులు మృత్యువాత‌ ప‌డుతుండ‌టంతో సిబ్బంది కొర‌త కూడా ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సాయుధ పోలీసు దళాల నుండి సుమారు 2,000 మంది అదనపు పోలీసులను పంపమని కోంద్రాన్ని కోరింది. 

భార‌త్‌లోనే అత్య‌ధికంగా మహారాష్త్ర‌లో క‌రోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 44,582 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఇక ప్రాణాంతక వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1517 కు పెర‌గ‌గా, శుక్ర‌వారం ఒక్క‌రోజే 63 మంది ప్రాణాలు కోల్పోయారు.