మా కార్పొరేటర్ల జోలికొస్తే కేసీఆర్ ఎంపీలు జాగ్రత్త!

ఎమ్యెల్సీ ఎన్నికలలో కుమార్తె కవితను గెలిపించుకోవడం కోసం బిజెపికి చెందిన మున్సిపల్ కార్పొరేటర్లపై వత్తిడి తెచ్చి టి ఆర్ ఎస్ లో జేర్పించుకో ప్రయత్నం చేస్తుండటం పట్ల బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ గట్టి హెచ్చరిక చేశారు. "మీరు మా కార్పొరేటర్లను మీ వైపు చేర్చుకొంటే మీ ఎంపిలను మేము చేర్హ్చుకోవలసి వస్తుంది" అంటూ తేల్చి చెప్పారు. 

గత లోక్ సభ ఎన్నికలలో కవితను ఓడించిన అరవింద్   ప్రజాప్రతినిధులను బెదిరించి టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే నిజామాబాదు లో ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లను టి ఆర్ ఎస్ లో చేర్చుకోవడం తెలిసిందే. ఫిరాయింపులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. 

కాగా  తెలంగాణాలో ప్రభుత్వ అండతో గనుల తవ్వకాల్లో అక్రమాలు పెద్ద పెట్టున జరుగుతున్నాయని అరవింద్ ఆరోపించారు. మైం హోమ్ సంస్థలో ఐర్లాండ్ కంపెనీ భాగస్వామిగా ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే మైనింగ్‌లో విదేశీ సంస్థలకు అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 

ఐర్లాండ్‌ కంపెనీకి 50 శాతం వాటా ఎలా ఇస్తారని  అరవింద్ ప్రశ్నించారు. మైనింగ్ లీజులన్నీ నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన స్పష్టం చేసారు. విదేశీ కంపెనీతో కలిసి మైం హోం సంస్థ తీవ్ర మోసాలకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. మైం హోం సంస్థ అక్రమాలను సీబీఐ బయటపెట్టాలని అరవింద్ డిమాండ్ చేశారు.