ఒడిషాకు ప్రధాని తక్షణ సాయంగా రూ 500 కోట్లు 

ఎంఫాన్ తుపాన్ తాకిడికి గురైన ఒడిషాకు రూ 1500 కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇది తాత్కాలిక సాయం మాత్రమే అని శుక్రవారం ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు బెంగాల్ కు రూ 1,000 కోట్ల తక్షణ సహాయం ప్రకటించారు. 

పశ్చిమ బెంగాల్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే జరిపిన ప్రధాని, తర్వాత ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇతరులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు.  తరువాత భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ విమానాశ్రయంలోనే ఉన్నతస్థాయిలో ప్రధాని సమీక్షించారు. 

ఇందులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ సారంగీ ఇతరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదిక అందిన తరువాత దీర్ఘకాలిక సహాయ చర్యలు ఉంటాయని ప్రధాని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, భద్రక్, బాలాసోర్ వంటి జిల్లాలో ప్రధాని ఏరియల్ సర్వే జరిపారు.

వైరస్‌ను ఎదుర్కొనేందుకు భౌతిక దూరం పాటించాలి, సామూహిక ఉనికి ఉండకూడదు. అయితే తుపాన్ నుంచి రక్షించేందుకు ప్రజలను సామూహికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని ప్రధాని మోడీ చెప్పారు. ఇది ఓ సంకట తీవ్రత అని తెలిపారు. సహాయక కేంద్రాలలో భారీ సంఖ్యలో జనం ఉండాల్సి రావడంతో వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకునే చర్యలకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. 

తుపాన్‌తో పూర్తిగా దెబ్బతిన్న కోల్‌కతాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో అత్యధిక ప్రాంతంలో రాత్రిపూట చీకట్లు కమ్ముకున్నాయి. మొబైల్ సిగ్నల్స్‌కు ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది. ఓ వైపు కరోనా వైరస్ ప్రభావం తీవ్రం అవుతున్న దశలోనే ఇప్పుడు తుపాన్ విరుచుకుపడటం, కాలుష్య వాతావరణానికి దారితీయడంతో పరిస్థితి మరింత దిగజారుతుందని ఇరు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. 

నిత్యం పలు రైళ్లు ఇతరత్రా లక్షలాది మంది వలస కూలీలు స్వరాష్ట్రాలకు తరలిరావడంతో వారికి సరైన ఏర్పాట్లు చేయడం, మరో వైపు వైరస్ నియంత్రణ చర్యలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉండటంతో రెండు రాష్ట్రాల సిఎంలు పలు విధాలుగా సాధనసంపత్తులను సమకూర్చుకునే దిశలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్, సిఎం మమత బెనర్జీ, రాష్ట్ర ఉన్నతాధికారులతో అంతకు ముందు  ప్రధాని మోడీ పరిస్థితి గురించి తొలుత కోల్‌కతాలో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. రాష్ట్రానికి ఇటీవలి కాలంలో ఎప్పుడూలేని స్థాయిలో తుపాన్ బీభత్సంతో నష్టం వాటిల్లిందని ప్రధానికి మమత బెనర్జీ తెలిపారు. లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని, దీనిని కేంద్రం భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 

కరోనావైరస్ వ్యాప్తి, మృతుల సంఖ్య పెరగడం, మరో వైపు వలసకూలీల ఆగమనం , తీవ్రస్థాయిలో కేంద్రంతో రాజకీయ వివాదాల సుడిగుండంలో ఉన్న బెంగాల్‌పై ఎంఫాన్ భీకర రీతిలోనే విరుచుకుపడింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో దెబ్బతిన్న పంటలతో కూడిన పొలాలను ప్రధాని చూశారు.