పాక్ లో హిందువుల బస్తి నేలమట్టం 

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండమంటూ యావత్ ప్రపంచం జాగ్రత్తలు తీసుకుంటుంటే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం సొంత గడ్డపైనే ప్రజలను నిర్వాసితులను చేస్తున్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. మైనారిటీ హిందువుల బస్తీ మొత్తాన్ని నేలమట్టం చేయించి మరోసారి తన వికృతరూపాన్ని పాక్ యంత్రాంగం చాటుకుంది. 

పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్‌పూర్‌లో ఓ బస్తీ మొత్తాన్ని పాక్ ప్రభుత్వాధికారులు బుల్‌డోజర్లతో నేలమట్టం చేయడంతో అక్కడి ప్రజల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాకిస్థాన్ గృహనిర్మాణ మంత్రి తారిఖ్ బషీర్, దేశ ప్రధా సమాచార అధికారి సాహిద్ ఖోఖర్ పర్వవేక్షణలో అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. సొంత గూడు కోల్పోయిన హిందూ మైనారిటీ ప్రజలు మంటుటెండల్లో కట్టుబట్టలతో మిగిలారు. 

మైనారిటీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఇటీవల దేశ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టిన కొద్దిరోజులకే పాక్ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడటం సంచలనమవుతోంది.

ఇటీవల ఇదే తరహా మరో ఘటన కూడా పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఖనేవాల్ జిల్లాలో క్రైస్తవుల  ఇళ్లు, స్మశాన వాటికను ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు ధ్వంసం చేశాడు. 

సింధు ప్రావిన్స్‌లోను, ఇతర ప్రాంతాల్లోనూ హిందూ మైనర్ బాలిలకను బలవంతంగా  అహహరించి, ఇస్లామ్‌లోకి మార్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు తరచు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మైనారిటీలపై జరుగుతున్న దాడులకైతే అంతూ పొంతూ లేకుండా ఉంది.

పాకిస్థాన్ ప్రభుత్వం మతపర మైనారిటీల పట్ల వివక్షత ప్రదర్శిస్తుండటం అందరికి తెలిసిందే. సామూహిక హత్యలు, చట్టబద్ధ హత్యలు, అపహరణాలు, అత్యాచారాలు,  బలవంతంగా ఇస్లాంలోకి మాత మార్పుడులు వంటి వేధింపులకు ఆ దేశంలోని హిందువులు, క్రైస్తవులు, శిఖులు, అహ్మదియాలు, షియాలు గురవుతున్నారు.