యోగి ఆదిత్యనాథ్ ను చంపుతానని బెదిరింపు 

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఒక వ్యక్తి బాంబు తో చంపుతానని అంటూ బెదిరిస్తూ పోలీసులకే సందేశం పంపారు. గురువారం అర్ధరాత్రి వాట్స్ అప్ లో యుపి పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ 112కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. 

గుర్తు తెలియని వ్యక్తి ఈ సందేశంలో యోగిని ఒక వర్గపు శత్రువుగా పేర్కొంటూ తాను ఆయనను బాంబు తో అంతం చేస్తానని బెదిరించాడు. దీనిపై లక్నో లోని  గోమతి నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ధీరజ్ కుమార్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. 

ఐపీసీ 505 (1)(బి) క్రింద ప్రభుత్వం లేదా ప్రజా భద్రతకు వ్యతిరేకంగా నేరం చేయడం, సెక్షన్ 506 కింద చంపుతానని బెదిరించడం, 507 క్రింద బెదిరించడానికి అపరిచితంగా సమాచారాన్ని ఉపయోగించడంపై నేరాలు నమోదు చేశారు. 

రాత్రి 12.32కి ఆ బెదిరింపు సందేశం రాగానే వెంటనే పోలీస్ స్టేషన్ కు తెలుపగానే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాట్స్ ఆప్ లో బెదిరింపు సందేశం రావడం గురించి అదనపు డైరెక్టర్ జనరల్ ఆసిన్ అరుణ్ కూడా నిర్ధారించారు.

ఇంతకు ముందు మే 5న ఘజహిపూర్ వద్ద తన్వీర్ ఖాన్ అనే బీహార్ పోలీసును ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను గత నెల ఏప్రిల్ 24న పేస్ బుక్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపుతానని వేసిన వివాదాస్పద పోస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అంతకు ముందు కూడా పేస్ బుక్ లో "దిల్దా నగర్, కంసరోబర్ ప్రాంతాలలో  అజాన్లు  జరగడం లేదు. యోగి ను చంపవలసిందే" అంటూ పోస్ట్ చేసాడు. కరోనా కారణంగా మసీదుల వద్ద గుంపులుగా చేరడాన్ని నిషేధించినా, అజాన్ లపై ఎటువంటి ఆంక్షలు లేవని ఇంతకు ముందే యుపి ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం.