ఉత్తరాది కార్మికుల వలసలపై ఆత్మరక్షణలో కాంగ్రెస్

గుజరాత్ నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులు భయంతో సొంత రాష్త్రాలకు పారిపోతూ ఉండడంతో రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు కురిపించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిన్నట్లు కనిపిస్తున్నది. ఆ విధంగా వారు పారిపోవడానికి కారణం కాంగ్రెస్ ఎమ్యెల్యే అల్పేష్ ఠాకూర్ కారణమనే విమర్శలు చెలరేగడంతో కాంగ్రెస్ నోట మాట రావడం లేదు.

దాడుల భయంలో పొరుగు రాష్ట్రాల వలస కార్మికులు గుజరాత్‌ను పెద్దఎత్తున విడిచిపోతున్న వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుపుకొంటోంది. బీజేపీ మత ఉద్రిక్తతలు, గందరగోళాన్ని సృష్టిస్తోందని, ఉత్తరాది ప్రజలు కూడా ఇండియన్లేనంటూ విపక్షాలు గళం విప్పుతుండటంతో బీజేపీ దీటుగా స్పందించింది. గుజరాత్‌లో దాడులకు పురిగొల్పిన అల్పేష్ ఠాకూర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది.

ఒకవంక, బిజెపి ప్రభుత్వం రక్షణ కల్పించలేక పోవడంతో వారు పారిపోతున్నట్లు కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ నుండి చాలామంది విమర్శలు గుప్పిస్తూ ఉంటె, అల్పేష్ ఠాకూర్ మాత్రం  గుజరాత్‌ నుంచి వలస కార్మికులు పారిపోవడం లేదని, ఛట్ పూజ్ కోసమే వెళ్తున్నారని పేర్కొనడం గమనార్హం.

వలస కార్మికులపై దాడులను ప్రోత్సహించారన్న ఆరోపణలను ఎడుర్కొంతున్న ఆయన ఠాకూర్ సేనకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సేన ఆధర్యంలోనే పలుచోట్ల ఉత్తరాది నుండి వచ్చిన వలస కార్మికులపై దాడులు జరిగాయి. పైగా, గుజరాత్‌లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ఇటీవల డిమాండ్ చేసారు. ఆయన రెచ్చగొట్టడం వల్లననే ఈ అల్లర్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

‘‘ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన వారిపై గుజరాత్‌లో దాడులు జరుగుతున్నాయి. వారిని అక్కడనుంచి వెళ్లగొడుతున్నారు. ఏదో ఒకరోజు ప్రధాని మోదీ వారణాసి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ప్రజలకు ఆయన ముఖం ఎలా చూపిస్తారు’’ అని కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించడం గమనార్హం.  ఈ దాడులు ఆపలేకపోతే ప్రధాని మోదీ, సీఎం విజయ్‌ రుపానీ ఆ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు వారికి లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది విమర్శించారు.

మరోవంక, రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ ప్రకటించారు. రాష్ట్రం నుండి వెళ్ళిపోయిన వలస కార్మికులు వెనక్కి రావాలంటూ హోంమంత్రి ప్రదీప్‌సింగ్‌ జడేజా విజ్ఞప్తి చేసారు. దాడులు బాధ్యులైన 450 మందిని అరెస్ట్ చేసిన్నట్లు తెలిపారు. యూపీ, మధ్యప్రదేశ్‌, బిహార్‌కు చెందిన 20 వేలమంది గుజరాత్‌ను వదిలి వచ్చేశారని ఉత్తర భారతీయ వికాస్‌ పరిషత్‌ అధ్యక్షుడు మహేశ్‌ సింగ్‌ కుశావహ చెప్పారు.

గుజరాత్, బీహార్, ఇండియా పట్ల నిజంగానే రాహుల్‌కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్‌ను ఆ పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేసారు. యూపీ, బీహార్‌ వలస కార్మికులకు వ్యతిరేకంగా అల్పేష్ ఠాకూర్ దాడులకు రెచ్చగొట్టారని, క్షత్రియ ఠూకూర్ సేనకు సారథ్యం వహించడమే కాకుండా గుజరాత్‌లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారని గుర్తు చేసారు.

సేన కార్యకర్తలే కొన్ని చోట్ల దాడులకు పాల్పడ్డారని చెబుతూ అంతా జరిగిన తర్వాత ఇప్పుడు కార్మికులు గుజరాత్ వీడి వెళ్లిపోవడం లేదని, ఛట్ పూజ కోసం వెళ్తున్నారని అల్పేష్ చెప్పడం దేనికి సంకేతంగా అనుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా అల్పేష్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తారో లేదో చెప్పాలని రాహుల్‌ను, కాంగ్రెస్ పార్టీని సంబిత్ పాత్ర నిలదీశారు.