సీబీఐకి డా. సుధాకర్ వ్యవహారం 

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ హై కోర్ట్ లో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ వేధింపులకు గురవుతున్నారని భావిస్తున్న సస్పెన్షన్ లో ఉన్న ప్రభుత్వ వైద్యుడు డా. సుధాకర్ వ్యవహారంపై సిబిఐని దర్యాప్తి చేయమని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 

విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది. 

సుధాకర్‌ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ఊసే లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదని, దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని, ఈ కారణాలతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది. 

గత శనివారం డాక్టర్ సుధాకర్ ను చాల అమానుషమైన రీతీలో అరెస్ట్ చేసినవిషయం తెలిసిందే. పైగా,  సుధాకర్ మానసిక స్థతి సరిగ్గా లేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో మెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి తాజా ఆదేశాలు జారీ చేసింది.   

హైకోర్టు తీర్పుపట్ల డా సుధాకర్ తల్లి హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడికి న్యాయం జరగాలని పరువు కాపాడుకోవాలంటే హైకోర్టు ఒక్కటే తమకు దిక్కు అని  ఆమె పేర్కొన్నారు.  

డాక్టర్ సుధాకర్‌ని సస్పెండ్ చేయడం దారుణం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. సుధాకర్ వ్యవహారంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం తీరును తప్పుపట్టారు.

పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు కూడా అభ్యంతరం తెలిపిందన్నారు. ప్రశ్నించే వారిపై ఇలాంటి చర్యలకు దిగడం సమంజసం కాదన్నారు. డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కన్నా డిమాండ్ చేశారు.