శ్రీవారి లడ్డు ప్రసాదం అమ్మకంపై వివాదం 

ప్రసిద్ధమైన తిరుమలలోని శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని మెట్రో నగరాలలోతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని  జిల్లా కేంద్రాలలో భక్తులకు సగం ధరకే అమ్మాలని టిటిడి అధికారులు నిర్ణయించడం పట్ల పెను వివాదం చెలరేగుతుంది. గతంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగినా భక్తుల నుండి, ఆలయ సంప్రదాయాలు తెలిసిన వారినుండి వ్యతిరేకత వ్యక్తం కావడంతో విరమించుకున్నారు. 

 పైగా, 2017లో తిరుమలలో 5కాకుండా మరెక్కడా లడ్డు ప్రసాదం విక్రయించరాదని ఉత్తరువు కూడా టిడిడి జారీచేసింది. అయితే ఇప్పుడా ఉత్తరువును గాలికి వదిలివేసి, కరోనా మహమ్మారి కారణంగా తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోలేక పోతున్న భక్తులకు శ్రీవారి బహుమతిగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు. 

ప్రస్తుతం తిరుమలలో రూ 50 కు విక్రయిస్తున్న లడ్డు ప్రసాదాన్ని ఇప్పుడు రూ 25కె అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. పైగా, ఎన్ని కావలసిన తీసుకోవచ్చని తెలిపారు. ఈ నిర్ణయం పట్ల తిరుమలలోని ఆచార వ్యవహారాల పట్ల విశేషమైన పరిజ్ఞానం గల గౌరవ పురోహితులు రమణ దీక్షితులు మండిపడ్డారు. 

ఈ విధంగా లడ్డు ప్రసాదాన్ని ఎక్కడ పడితే అక్కడ అందించడం ఆగమ సంప్రదాయానికి విరుద్ధమని, ప్రసాదాన్ని వ్యాపారం కావించడమే అని స్పష్టం చేశారు. అధికారులు ఎవ్వైర్ని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారో అని విస్మయం వ్యక్తం చేశారు. ఆలయంలో శ్రీవారికి ప్రసాదంగా అర్పించిన తర్వాతనే    ప్రసాదంకు విలువ ఉంటుందని, కానీ అదేమీ లేకుండా బైట ప్రాంతాలలో అమ్మడంతో దాని విలువ ఏమిటని ఒక టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రశ్నించారు. 

అధికారులు ఈ నిర్ణయం తీసుకొనే ముందు తమను సంప్రదించి ఉంటె తమ అభిప్రాయం చెప్పేవారమని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా తిరుమలలో మాత్రం పరిష్టితులు ఏ మాత్రం మారలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పట్ల కొంచెం దృష్టి సారించాలని ఆయన కోరారు. 

శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం ఇస్తే భక్తులు సంతృప్తి చెందుతారని అయన తెలిపారు. కానీ తిరుమల లడ్డుకు క్రేజ్ పెరిగి తమ పనుల కోసం పెద్దలకు అందివ్వడం అలవాటుగా మారినదని, అందుకనే డిమాండ్ పెరిగినది చెప్పారు. అదే విధంగా పేరుకు పోయిన నిల్వలను ఖాళీ చేయడం కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని పేర్కొన్నారు. 

అసలు ప్రసాదం అమ్మమని ఏ శాస్త్రంలో కూడా లేదని, తిరుమలలో ఉన్న పలు శాసనాలలో ప్రసాదం కోసం నిధులు సమకూర్చిన రాజులు, దాతలు ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా ఇవ్వమని చెప్పిన్నట్లు ఇప్పటికి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని దీక్షుతులు వెల్లడించారు. 

గతంలో టిడిపి ప్రభుత్వం వంశపారంపర పౌరాహిత్యాన్ని రద్దు చేసి, రమణ దీక్షులును తిరుమలలో విధుల నుండి తీసి వేయగా,  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనను గౌరవనీయ పదవిలో తిరిగి నియమించడం తెలిసిందే.