కేసీఆర్ ఉద్దేశ్యాన్ని బయటపెట్టిన ఈటెల! 

కేవలం రాజకీయ వత్తిడుల మేరకు కేసీఆర్ కరోనా టెస్ట్ లను కుదించివేసి, రాష్ట్రంలో కరోనా కేసులు - మరణాలు తగ్గిపోయిన్నట్లు చెప్పుకొంటున్నారని చెలరేగుతున్న ఆరోపణలను సమర్ధించే రీతిలో రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. 

రాష్ట్రంలో కరోనా పరిక్షలు సరిగ్గా జరపగా పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూడాన్ రాష్ట్ర ప్రభుత్వంకు వ్రాసిన లేఖకు తామేమి చేస్తున్నామో చెప్పే ప్రయత్నం చేయకుండా ఆయన ఆవేశంతో ఊగిపోయారు. 

`దారినపోయే దానయ్యలకు పరీక్షలు జరపాలా' అంటూ తికమకగా స్పందించారు. పైగా,  "మీరేం(కేంద్రం) కోరుకుంటున్నారు? ఈ దశలో వందల సంఖ్యలో కేసులు రావాలని కోరుకుంటున్నారా? వందల శవాలు రావాలని కోరుకుంటున్నారా?’’ అని మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రంపై ధ్వజమెత్తారు. "ఈ దశలో" అంటే రంజాన్ దశలో అని అర్థమా అనే అనుమానం తలెత్తుతుంది. 

మిత్రపక్షమైన ఎంఐఎం నాయకత్వం వత్తిడులకు లొంగి కరోనా పరీక్షలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపణలు రావడం తెలిసిందే. పరీక్షలు సరిగా జరిపితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు బైట పడతాయని మంత్రి గారి మాటలలోనే వెల్లడి అవుతున్నది. ఈ విధంగా వెల్లడి  కాకుండా కప్పిపుచ్చడం కోసమే పరీక్షలను జరపడంలేదని కూడా స్పష్టం అవుతుంది. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరీక్షలు, చికిత్సలు చేస్తున్నామని ఈ సందర్భంగా  మంత్రి ఈటల రాజేందర్‌ పేరొనడం గమనార్హం. అంటే అవసరం ఉన్నా పరీక్షలు సరిగ్గా చేయడం లేదా అనే ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి. 

మొదట నెలరోజుల పాటు దేశం మొత్తం లోనే కరోనా కట్టడికి సమర్ధవంతంగా  పనిచేస్తున్న ప్రభుత్వంగా కేసీఆర్ గుర్తింపు పొందారు. అందుకు ప్రధాన సూత్రధారి ముందుండి ఈ పోరాటం నడిపించిన రాజేందర్. 

అయితే గత నెల రోజులుగా రాజకీయ వత్తిడుల కారణంగా ఒక విధంగా ఆయన నిస్సహాయులుగా ఉండిపోయారా? అందుకనే ఆయన ఈ విధంగా కేంద్రం ఇచ్చిన లేఖపై స్పందిస్తున్నారా? అనే అనుమానాలు ఈటెల స్పందనలో వ్యక్తం అవుతున్నాయి.