తెలంగాణాలో 45కు చేరుకున్న కరోనా మరణాలు 

తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 45కు పెరిగింది. గడిచిన మూడు రోజుల్లోనే 11 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం నలుగురు, బుధవారం ఇద్దరు మరణించగా, గురువారం ఒక్కరోజే ఐదుగురు చనిపోయారు. 

హైదరాబాద్ కు చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ బుధవారం రాత్రి కరోనాతో మృతి చెందినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ఆయన మరణాన్ని బుధవారం నాటి బులిటెన్‌లో పేర్కొనలేదు. కరోనా విధుల్లో ఉన్న ఓ వ్యక్తి చనిపోవడం ఇదే తొలిసారి. 

మిగతావారిలో.. మలక్‌పేట ఆనంద్‌ నగర్‌కు చెందిన ఒక వృద్ధుడికి (70) ఈ నెల 13న కరోనా పాజిటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించారు.  మలక్‌పేట తీగలగూడకు చెందిన వృద్ధుడికి (69) వైరస్‌ సోకినట్టు ఈ నెల 14న పరీక్షల్లో తేలింది. ఆయనా గురువారం చనిపోయారు. ఖాజీగూడకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి 16న వైరస్‌ పాజిటివ్‌ రాగా గురువారం మరణించాడు. 

కాగా, రాష్ట్రంలో గురువారంనాడు 38 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.వైరస్‌ సోకిన 38 మందిలో 26 మంది గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందినవారే. రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదు కాగా.. మిగిలిన పది మందీ వలస కార్మికులు. వారితో కలిపి ఇప్పటివరకు కరోనా బారిన పడిన వలస కార్మికుల సంఖ్య 99కి చేరింది. 

కొత్తగా నమోదైన 38 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 1699కి చేరింది. 1036 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. చికిత్స పొందుతున్న వారు 618 మంది ఉన్నారు.