మహా కూటమిలో సీట్ల కుంపటి... కోదండరాం అల్టిమేటం

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినా ఇంకా సీట్ల కేటాయింపు, పొత్తుల అంశంపై స్పష్టత లేకపోవడంతో తెలంగాణలో మహాకుటమిలోని పక్షాలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహిస్తున్నదనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక గురించి తప్ప ఇప్పటి వరకు సీట్ల సర్దుబాట్లపై ప్రాధమిక చర్చలు కుడా జరుపక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

మరోవంక మహాకూటమిలోని ఇతర పార్టీలు ఎవ్వరికీ ఎక్కువ సీట్లలో పోటీ చేసే బలం లేదని, బలమైన అభ్యర్ధులు కుడా లేరని, కాని గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ఉండడంతో సొంత పార్టీలో అసమ్మతికి దారితీయ వచ్చని కాంగ్రెస్ భయపడుతున్నది. మొత్తం మీద తాము 100 సీట్లలో పోటీ చేసి, మిగిలిన 19 సీట్లను మాత్రమె భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అయితే టిడిపి, మహాజన కూటమి చెరో 25 నుండి 30 సీట్ల వరకు కోరుతున్నాయి. సిపిఎం కుడా 11 సీట్లను కోరుతున్నది. వాటికి నచ్చచెప్పడం కాంగ్రెస్ కు సాధ్యం కావడం లేదు.

ఇట్లా ఉండగా, త్వరగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై తేల్చాలంటూ ఆయన మహాకూటమిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌కు టిజేఎస్ అద్యక్షుడు కోదండరాం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తేల్చని పక్షంలో పక్షంలో భావసారూప్యత కల్గిన పార్టీలతో ముందుకెళ్తానని అల్టిమేటం జారీ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి లేఖ వ్రాసారు. 48గంటల్లోగా సీట్ల కేటాయింపు అంశాన్ని తేల్చాలని, లేకపోతే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించినట్టు తెలుస్తున్నది.

తాము కోరుకున్న సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే కలిసొచ్చే పక్షాలతో ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమకు రెండు, మూడు సీట్లు మాత్రమె ఇస్తారని, కోదండరాం అసలు పోటీ చేయబోరని అంటూ కాంగ్రెస్ నేతలో ప్రచారం చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కూడా ప్రకటించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.

దానితో కోదండరాంతో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. వాస్తవానికి మంగళవారం  మహాకూటమి నేతలంతా భేటీ అయి కీలక అంశాలపై చర్చించాల్సి ఉన్నప్పటికీ చివరి క్షణంలో సమావేశం మరుసటి రోజుకు  వాయిదా పడింది. సీట్ల సంగతి తేలక పోవడంతో అభ్యర్ధుల ఖరారు సాధ్యం కావడం లేదని, దానితో ఉమ్మడి ఎన్నికల ప్రచారం గురించి ఆలోచనలకు ఆస్కారం ఉండటం లేదని ఆపోతున్నారు.