కేసీఆర్ కరోనా టెస్ట్ ల తగ్గింపుపై కేంద్రం ఆగ్రహం 

తెలంగాణలో కరోనాను కట్టడి చేశామని చెప్పుకోవడం కోసం  తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖ్రరావు కరోనా పరీక్షలను గణనీయంగా తాగిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "మనం వైరస్ ను వెంటాడని పక్షంలో వైరస్ మనల్ని వెంటాడుతుంది" అంటూ సున్నితంగా హెచ్చరించింది. 

దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాపై ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్‌లో తీవ్ర నష్టం ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. 

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ గురువారం లేఖ రాశారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. 

దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కవ పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడింది. బుధవారం నాటికి తెలంగాణలో 1,661 మంది కి వైరస్ సోకున్నట్లు నిర్ధారణ కాగా, 40 మంది మృతి చెందారు. పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిరోజూ సుమారు 9,000 టెస్ట్ లు నిర్వహిస్తుండగా, తెలంగాణలో సుమారు 200 మాత్రమే నిర్వహిస్తున్నారు. 

జాతీయ స్థాయిలో 10 లక్షల మంది జనాభాలో 1,025 మందికి టెస్ట్ లు జరుపగా, తెలంగాణలో 546 మందికి, అంటే దాదాపు సగం మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. విస్తృతంగా టెస్ట్ లు జరపడం ద్వారా పాజిటివ్ కేసులను ఎక్కువగా గుర్తించి, ఈ వైరస్ ను సమర్ధవంతంగా కట్టడి చేయడానికి వీలవుతుందని ప్రీతి సుడాన్ హితవు చెప్పారు. 

మరోవంక ఇసిఎంఆర్ అనుమతించిన ప్రైవేట్ లాబ్స్ ను కరోనా పరీక్షలు జరపకుండా తెలంగాణ ఆంక్షలు విధించడం పట్ల కేంద్రం విస్మయం వ్యక్తం చేసింది. పరీక్షలు జరుపుకొనేందుకు విస్తృతంగా ఎక్కువమందికి అందుబాటులో ఉండటం మంచిదని స్పష్టం చేసింది. 

ఈ విషయమై రాష్ట్ర హై కోర్ట్ కూడా గత సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం గమనార్హం. కేరళలో వలే సంచార పరీక్షలు జరిపే ఏర్పాట్లు చేయమని సూచిందింది.