బెంగాల్‌కు అండగా దేశం యావత్తు

అంఫాన్ తుఫాన్ కు తీవ్రంగా ప్రభావితమైన పశ్చిమ బెంగాల్ కు మొత్తం దేశం అండగా నిలబడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. బెంగాల్ లో తుఫాన్ స్రుసీతఁచిన విధ్వంసానికి సంబంధించి మీడియాలో ప్రసారమవుతున్న వీడియోలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయని ప్రధాని ట్వీట్‌ చేశారు. 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం అన్ని విధాలుగా బెంగాల్‌కు సహకరిస్తుందని, బెంగాల్‌ ప్రజల క్షేమం కోసం దేశం ప్రార్థిస్తున్నదని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.  పశ్చిమబెంగాల్‌లో పరిస్థితిని చక్కదిద్దేందు చేపట్టాల్సిన అన్ని చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని తెలిపారు. 

తుఫాను తీరాన్ని తాకడానికి ముందే నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌ (ఎన్ డి ఆర్ ఎఫ్) బెంగాల్‌కు చేరుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ డి ఆర్ ఎఫ్ బలగాల సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని ప్రధాని ట్వట్టిర్‌లో పేర్కొన్నారు. 

ఇలా ఉండగా, అంఫాన్‌ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్‌, ఒడిశా  రాష్ట్రాలు   అతలాకుతలమవుతున్నాయి. అవసరమైతేనే ఆ రెండు రాష్ట్రాల  ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. 

ఈ నేపథ్యంలో అమిత్‌ షా.. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌ లతో ఫోన్‌ లో మాట్లాడారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై అమిత్‌ షా ఆరా తీశారు. అన్ని విధాలా వారిని ఆదుకుంటామని ఆయన హామీనిచ్చారు. 

ప్రతి పౌరుడి భద్రత, రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అమిత్‌ షా స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు ఆయన పేర్కొన్నారు.